ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతికి ఫిర్యాదు

1 Jul, 2019 14:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో ఇంటర్‌ విద్యార్ధుల ఆత్మహత్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలపై విచారణ జరిపించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చాలా బాధపడ్డారని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపించాలన్న తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారన్నారు. ఇంటర్‌ విద్యార్థులవి ఆత్మహత్యలు కావని, అవి ప్రభుత్వ హత్యలని ఆరోపించారు.

రాష్ట్రంలో 27 మంది విద్యార్థులు చనిపోతే ప్రభుత్వం వారి కుటుంబాలను పట్టించుకోలేదన్నారు. ఫలితాల అవకతవకలకు కారణమైన గ్లోబరినా సంస్థపై చర్యలు తీసుకోకుండా మళ్లీ ఆ సంస్థకే రీ వెరిఫికేషన్‌ ప్రాజెక్టు ఇవ్వడం దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగేవరకూ బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు