కల్తీలకు కేరాఫ్‌గా గుంటూరు

12 Jan, 2018 08:43 IST|Sakshi

అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వ పెద్దలు

వైఎస్సార్‌ సీపీ జిల్లా పరిశీలకుడు బొత్స ఆగ్రహం

సర్వసభ్య సమావేశంలో పార్టీ పటిష్టతపై చర్చ

పట్నంబజారు (గుంటూరు): ప్రభుత్వ నిర్లిప్తత, అధికారుల అవినీతితో గుంటూరు జిల్లా కల్తీలకు కేరాఫ్‌గా మారిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, గుంటూరు జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వ పెద్దలు.. విత్తనాలు, కారం, పాలు, నూనె అని తేడా లేకుండా కల్తీలకు పాల్పడుతున్నా పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. గుంటూరు నగరంపాలెంలోని కేకేఆర్‌ ఫంక్షన్‌ ప్లాజాలో గురువారం నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఐదో విడత జన్మభూమిలో రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల అప్లికేషన్లు వస్తే..వాటిలో ఎన్ని పరిష్కరించగలిగారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ మూడున్నరేళ్ల పాలనలో చేసిన మంచి ఏమి లేదని, ప్రస్తుతం అందించిన దరఖాస్తుల్ని 2022లో పూర్తి చేస్తారా? అని ఎద్దేవా చేశారు. ఏ ఒక్కచోటా పేదవారికి ఇళ్లు కట్టించిన పాపాన పోలేదని మండిపడ్డారు. పోలీసుల్ని అడ్టుపెట్టుకుని జన్మభూమి సభలు నిర్వహించడం దారుణమని ఖండించారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు వైఎస్సార్‌ సీపీ పాటుపడుతోందని, దానిలో భాగంగా జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో బూత్‌ కమిటీల్ని పటిష్టం చేసి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

జన్మభూమి సభల్లో కానరాని చిత్తశుద్ధి : ఉమ్మారెడ్డి
 శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జన్మభూమి సభల్లో ఎక్కడా చిత్తశుద్ధి కనబడడం లేదని, ప్రభుత్వంలో జవాబుదారీతనం తగ్గిం దని విమర్శించారు. ఇప్పటి వరకూ నిర్వహిం చిన జన్మభూమి సభల్లో 42 లక్షల దాకా అర్జీ లు వచ్చాయని, వాటిల్లో లబ్ధిదారులకు ఎంత వరకూ న్యాయం జరిగిందని ప్రశ్నించారు. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఆధ్యక్షుడు రావి వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వంపై  వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకునేందుకు పాటుపడతామని తెలిపారు.

కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా,  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మోపిదేవి వెంకటరమణ, మర్రి రాజశేఖర్, ఆతుకూరి ఆంజనేయులు, కిలారి రోశయ్య, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చల్లపల్లి రామ్మోహనరావు, రాష్ట్ర కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, ఎండీ.నసీర్‌ అహ్మద్, మందపాటి శేషగిరిరావు, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కావటి మనోహర్‌నాయుడు, బొల్లా బ్రహ్మనాయుడు, అన్నాబత్తుని శివకుమార్, కత్తెర హెనీ క్రిస్టినా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్, పార్టీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు