బాబూ.. నీ జబ్బుకు ఇండియాలో మందు లేదు!

27 May, 2018 10:45 IST|Sakshi

టీటీడీ వివాదంలో ప్రధానిని సీబీఐ దర్యాప్తు కోరండి

బురద చల్లడం బాబుకు కొత్తేం కాదు

ఏదో జబ్బు ఆయన్ను వేధిస్తోంది

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం

సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఘాటు విమర్శలు చేశారు. ఆదివారం ఆయన చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో తవ్వకాలు, ఆస్తుల అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని, ఈమేరకు చంద్రబాబు ప్రధానిని కోరాలంటూ డిమాండ్‌ చేశారు. తరచూ బాబు నిప్పు అని చెప్పుకుంటున్నారని, అదే నిజమైతే దర్యాప్తు ముందు నిలబడాలని అన్నారు. బురద చల్లడం చంద్రబాబుకు కొత్తేం కాదని మండిపడ్డారు. 

సీఎం వద్ద ఆధారాలు వుంటే బయటపెట్టి తనని ముద్దాయిని చేయాలని.. అలా చేస్తే ఇద్దరి నిజస్వరూపం లోకానికి తెలుస్తుందని ముద్రగడ అన్నారు. ఇతర పార్టీల సహకారంతో తాను ఉద్యమం చేస్తున్నానని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో ఇసుమంతైనా నిజం లేదని వెల్లడించారు. తనను ఎదిరించే వారిని అదే కులస్తులతో తిట్టించే దురలవాటు ముఖ్యమంత్రికి ఉందని విమర్శించారు. బాబును ఏదో జబ్బు వేధిస్తోందని, దాని కారణంగానే ఇలాంటి దురలవాటు ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

భారతదేశంలో చంద్రబాబు రోగానికి మందు లేదని, అందుచేత జబ్బు బాగా ముదిరిపోయిందని ముద్రగడ ఎద్దేవా చేశారు. లోకేష్‌ మంత్రి పదవి కోసం ఓ పూజారిని సంప్రదించారని, కానీ పూజారి అడిగిన ప్రశ్నకు ఇంత వరకూ చంద్రబాబు ఎందుకు సమాధానం ఇవ్వలేదని నిలదీశారు. వంశపారపర్యంగా అర్చకత్వం ఉండకూడదన్న చంద్రబాబు, తన రాజకీయ వారసుడిగా ఉన్న లోకష్‌కు ఈ నియయం ఎందుకు వర్తించదని ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు