‘మోదీ తరహాలోనే కేసీఆర్‌’

24 May, 2018 17:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధికారంలోకి వస్తే పెట్రోల్‌ ధరలు తగ్గిస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు గరిష్టంగా ధరలు పెంచిందని తెలంగాణ కాంగ్రెస్‌ ప్రతినిధి దాసోజు శ్రావణ్‌ కుమార్‌ ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2014లో యూపీఏ సర్కార్‌ అధికారంలో ఉండగా అంతర్జాతీయ క్రూడాయిల్‌ ధరలు పెరిగాయని తెలిసినా.. పెట్రో ధరలు అదుపు చేయడంలేదని బీజేపీ నిరసనలు చేసింది. కానీ ఇప్పుడు మాత్రం క్రూడాయిల్‌ ధరలు తగ్గినా పెట్రో ధరలు తగ్గించడం లేదని మండిపడ్డారు. పెట్రో ఉత్పత్తులపై మోదీ తరహాలోనే కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

కేసీఆర్‌ సర్కార్‌ పెట్రో ఉత్పత్తులపై విపరీతమైన పన్నులు వేస్తోందని ఆరోపించారు. పెట్రోల్‌పై 35.2శాతం, డీజిల్‌పై 25శాతం రాష్ట్ర ప్రభుత్వం పన్ను వసూలు చేస్తోందని పేర్కొన్నారు. పెట్రో ధరల పెంపు ప్రభావం నిత్యావసర ధరలపై పడుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రో టాక్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పెట్రో ధరలు తగ్గించేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం చేయాలని సూచించారు. గోవా, మిజోరాం, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలలో కంటే తెలంగాణలోనే పెట్రో ఉత్పత్తులపై అధిక పన్ను వేస్తున్నారని ఆరోపించారు. పెట్రో ఉత్పత్తుల పెంపుపై మోదీకి వ్యతిరేకంగా ఎలా అయితే నిరసన చేస్తున్నామో  రాష్ట్రంలో కూడా అలాంటి నిరసనలే చేయాలని శ్రావణ్‌ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు