'జై తెలంగాణ టూ జై ఆంధ్ర.. ఇదే మీ స్పూర్తి'

27 Feb, 2018 14:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ కు అనుకూలంగా జైరాం రమేష్‌ నిర్ణయం తీసుకున్నారని టీఆర్‌ఎస్‌ మంత్రులు తప్పు పట్టడంపై కాంగ్రెస్‌ నేత జీవన్‌ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీలపై పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రతిష్టాత్మకంగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు సాధిందలేదన్నారు. నాలుగు సంవత్సరాల నుంచి టీఆర్‌ఎస్‌ ఉద్యమ స్పూర్తి ఏమైందన్నారు. జై తెలంగాణ నుంచి జై ఆంధ్ర వరకు టీఆర్‌ఎస్‌ స్పూర్తి వెళ్లిందని ఎద్దేవా చేశారు.

సీబీఐ విచారణ భయం వల్ల టీఆర్‌ఎస్‌ కేంద్రంతో కుమ్మక్కై తెలంగాణకు ద్రోహం చేస్తుందని జీవన్‌ రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నేతలు ఇంకా గాలిలో మేడలు కడుతున్నారని.. ఏ ఒక్క హామీ కూడా కేసీఆర్‌ ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. మరో వైపు ప్రభుత్వం నిర్వహించిన రైతు సమన్వయ సమితులు.. ప్రభుత్వ సమావేశమా? పార్టీ సమావేశమా? అని ఆయన ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధరలను ప్రభుత్వం కేటాయించడం లేదని.. కేంద్రంపై నెపం నెట్టి కేసీఆర్‌ చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఉద్యమ నాయకుడు అయితే, తమ పార్టీ నాయకులు కూడా ఉద్యమకారులే అని జీవన్‌ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు