నల్లగొండలో ‘హస్తం’..నిస్తేజం!

10 Nov, 2019 09:10 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్‌ ఎన్నికలు ముంగిట్లో ఉన్నా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో ఏమాత్రం కార్యసన్నద్ధత కనిపించడం లేదు. రేపో, మాపో నోటిఫికేషన్‌ వెలువడుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ద్వితీయ శ్రేణిలో ఉత్తేజం నింపి నిస్తేజాన్ని పారదోలే ప్రయత్నాలు నాయకత్వం వైపునుంచి ఏమాత్రం జరగడం లేదన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గత ఏడాది జరిగిన శాసన సభ ముందస్తు ఎన్నికల నాటి నుంచి నిన్నామొన్నటి హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన  ఉప ఎన్నిక దాకా ఆ పార్టీకి పెద్దగా ఏమీ కలిసిరాలేదు.

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, నల్లగొండ లోక్‌సభా స్థానాల్లో విజయంతో కొంత ఊపిరి పీల్చుకున్నట్టు కనిపించింది. అయితే, అదీ భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో అంతో ఇంతో కార్యక్రమాలు జరుగుతున్నా, నల్లగొండ  ఎంపీ పరిధిలో మాత్రం ఎలాంటి కార్యకలాపాల్లేవు.

నెల రోజుల పాటు హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికతో కార్యకర్తల్లో కొంత ఊపు వచ్చినా, రెండు వారాల కిందట వెలువడిన ఫలితం కాంగ్రెస్‌కు ప్రతికూలంగా రావడం పార్టీ శ్రేణులను మరింత నైరాశ్యంలో పడేశాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ ఉనికిని కాపాడుతూ, మున్సిపల్‌ ఎన్నికలకు తయారు చేయాల్సిన జిల్లా నాయకత్వం ఆ దిశలో పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

శాసనసభ ఎన్నికల తర్వాత మారిన సీను 
గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల తర్వాత జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితి తారుమారైంది. అంతకు ముందు జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో ఐదు చోట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉండేవారు. కానీ, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం మునుగోడు, నకిరేకల్, హుజూర్‌నగర్‌లలో విజయం సాధించింది. కొద్ది నెలలకే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా ఉండిన టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నల్లగొండ ఎంపీగా విజయం సాధించడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది.

ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన సిట్టింగ్‌ స్థానాన్ని టీఆర్‌ఎస్‌కు వదులుకోవాల్సి వచ్చింది. ఈ మధ్యలోనే నకిరేకల్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. ఆలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌ ఆ తర్వాతి రాజకీయ పరిణామాల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు చివరి గడువు రోజు టికెట్‌ దక్కించుకుని మిర్యాలగూడనుంచి పోటీ చేసిన బీసీ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇటువైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు ఆలేరు, నకిరేకల్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓ ఇన్‌చార్జ్‌ అంటూ ఎవరూ లేరు.

అదే మాదిరిగా, కోదాడ, హుజూర్‌నగర్‌లలో ఉత్తమ్‌ దంపతులే ప్రాతినిధ్యం వహిస్తుండగా ఉప ఎన్నికల్లో ఓటమితో ఒకింత మౌనంగానే ఉ న్నారు. తిరిగి ఎప్పుడు కార్యకలాపాలు మొదలు పెడతారన్న అంశంపై శ్రేణుల్లో స్పష్టత లేదు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్, ఫలితాల తర్వాత ఈ నియోజవకర్గ పార్టీని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

ఇక, మునుగోడు నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఆయన ప్రస్తుతం స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్నారు. బీజేపీ నాయకత్వానికి ముఖ్యం గా ప్రధాని నరేంద్ర మోదీ గురించి గొప్పగా మాట్లాడి, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వాన్ని తప్పుపట్టిన ఆయన ఒక విధంగా పార్టీకి దూరంగా ఉన్నట్లేనని భావిస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ కలిపి విశ్లేషిస్తే.. ఉమ్మడి జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో కార్యకర్తలను పట్టించుకునే నాథుడే కనిపించడం లేదన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

ముందున్న ... ‘మున్సిపల్‌’ పోరు
మున్సిపల్‌ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తోంది. కోర్టు కేసులు కొలిక్కి వస్తే వెంటనే నోటిఫికేషన్‌ విడుదల అవుతుందన్న అంచనాతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఆయా రాజకీయ పార్టీలు కూడా తమకు పట్టున్న వార్డులు, గతంలో తమ పార్టీ కౌన్సిర్లుగా పనిచేసిన వార్డుల్లో పని చేసుకోవడం మొదలు పెట్టారు. వాస్తవానికి జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీల్లో గతంలో కాంగ్రెస్‌ నుంచే ఎక్కువ మంది కౌన్సిలర్లు గెలిచినా, ఇటునుంచి టీఆర్‌ఎస్‌కు మారడంతో మున్సిపాలిటీలు కాంగ్రెస్‌ చే జారాయి.

ఈసారి కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలకు తోడు, పాత మున్సిపాలిటీల్లోనూ మొత్తంగా ఒక్కచోట కూడా కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వకుండా పాగా వేయాలని అధికార టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. దీనికి ప్రతిగా కాంగ్రెస్‌ నుంచి కనీసం రాజకీయ కార్యాచరణ కూడా కనిపించడం లేదన్న అభిప్రాయం ఉంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ప్రాతినిధ్యం వహించిన నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో నందికొండ, హాలియా మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి.

మునుగోడు నియోజకవర్గలో చండూరు, నకిరేకల్‌ నియోజకవర్గంలో చిట్యాల, హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో నేరేడుచర్ల, హుజూర్‌నగర్, తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి కొత్త మున్సిపాలిటీలు అయ్యాయి. వీటిల్లో కాంగ్రెస్‌ కార్యకలాపాలు పెద్దగా ఏమీ లేవని, మున్సిపల్‌ ఎన్నికలను ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని నాయకత్వం అందించలేక పోతోందని ద్వితీయ శ్రేణి నాయకత్వం వాపోతోంది.

దీంతో మున్సిపల్‌ పోరులో ఎలా ముందు పడాలో అర్థం కావడం లేదని పేర్కొంటున్నారు. మొత్తంగా అధినాయకత్వం దృష్టి సారిస్తే మినహా జిల్లాలో కాంగ్రెస్‌ మళ్లీ పట్టాలెక్కేలా కనిపించడం లేదని అభిప్రాయ పడుతున్నారు.    

మరిన్ని వార్తలు