గంగా ప్రక్షాళన గంగపాలు!

25 Aug, 2018 19:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘నా అంతట నేను ఇక్కడికి రాలేదు. నన్ను ఎవరూ ఇక్కడికి పంపించ లేదు. తల్లి గంగనే నన్ను ఇక్కడికి రప్పించిందని భావిస్తున్నాను’ అని 2014, ఏప్రిల్‌ 24వ తేదీన వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అదే రోజు ఆయన వారణాసి నుంచి లోక్‌సభకు తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా తాను బాబా బోలేనాథ్‌ ఆశీర్వాదంతో శబర్మతి ఆశ్రమాన్ని ఎలా తీర్చిదిద్దానో అలాగే వారణాసిని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను అని కూడా మోదీ అదే రోజు సాయంత్రం తన బ్లాగ్‌లో రాసుకున్నారు.

ఆ తర్వాత నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల్లోనే వారణాసికి వచ్చి గంగకు హారతి ఇచ్చారు. గంగానది ప్రక్షాళన కోసం 20,000 కోట్ల రూపాయలతో ‘నమామి గంగా’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. గంగా నదిలో కాలుష్యం శాతం 2014లో కన్నా ఇప్పుడు ఎక్కువగా ఉందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. గంగా నది ప్రక్షాళనకు మొత్తం 20 వేల కోట్ల రూపాయలను కేటాయించగా, వాటిని 2020 అంటే, మరో రెండేళ్లలో ఖర్చు పెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రక్షాళన ప్రాజెక్టుల పూర్తి ఎంత వరకు వచ్చాయో తెలుసుకునేందుకు మీడియా ఆర్టీఐ కింద పలు దరఖాస్తులు దాఖలు చేయగా, ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

మురుగు కాల్వల ప్రక్షాళన, పారిశ్రామిక వ్యర్థాల ట్రీట్‌మెంట్, గంగా నది ఉపరితలం క్లీనింగ్‌ కోసం నమామి గంగా పథకంలో భాగంగా కేంద్రం 221 ప్రాజెక్టులను ప్రకటించింది. వాటికి 2,238.73 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. 221 ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు 58 ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయి. మొత్తం ప్రాజెక్టుల్లో 26 శాతం ప్రాజెక్టులు మాత్రమే పూర్తయినట్లు ప్రభుత్వమే అంగీకరించింది. 105 సీవరేజ్, ఎస్‌టీపీ ప్రాజెక్టులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రాజెక్టులన్నింటినీ 2019, మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. మూడేళ్ల కాలంలో 26 శాతానికి మించి పూర్తికాని ప్రాజెక్టులను వచ్చే ఆరేడు నెలల్లో ఎలా పూర్తి చేస్తారో ఆయనకే తెలియాలి.

ఆయనకంటే ముందు జల వనరుల శాఖ మంత్రిగా గంగా నది ప్రక్షాళన ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించిన ఉమా భారతి 2017, ఫిబ్రవరి 21వ తేదీన మీడియాతో మాట్లాడుతూ 2018, జూలై నెల నాటికి ప్రాజెక్ట్‌ పూర్తికాకపోతే గంగానదిలోనే దూకి ఆత్మార్పణం చేసుకుంటానని శపథం చేశారు. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్‌ 4వ తేదీన ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు సకాలంలో ప్రారంభం కాకపోతే గంగా నది ఒడ్డున ఆమరణ దీక్ష చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆమె శపథాలు, ప్రతిజ్ఞల సంగతి పక్కన పెడితే ఆమె ఆధ్వర్యంలో పనులు మందగమనంతో కూడా నడవడం లేదని గ్రహించిన మోదీ ప్రభుత్వం గత సెప్టెంబర్‌ నెలలో ఆమెను జలవనరుల శాఖ నుంచి తప్పించి, ఆ శాఖను నితిన్‌ గడ్కరీకి అప్పగించింది. మునుపటికన్నా ఇప్పుడు గంగా జలాల కాలుష్యం శాతం పెరిగిందంటే ప్రాజెక్టుల పేరిట ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన సొమ్మంతా గంగ పాలేనా? అని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు