గుజరాత్‌ స్పీకర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

4 Jan, 2020 11:03 IST|Sakshi

గాంధీనగర్‌ : గుజరాత్‌ అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేది వివాదాస్పద  వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ ముసాయిదాను తయారుచేసిన ఘనత అంబేద్కర్‌ది కాదని, బ్రాహ్మణ కులానికి చెందిన బెనగళ్‌ నరసింహారావుదని అన్నారు. దానికి బ్రాహ్మణ సామాజిక వర్గమంతా ఎంతో గర్వపడాలని వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి గాంధీనగర్‌లో జరిగిన ‘మెగా బ్రాహ్మణ బిజినెస్‌ సమ్మిట్‌’ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ ముసాయిదా తయారు చేసిన ఘనత ముమ్మాటికి బ్రహ్మణుడైన బీఎన్‌ రావ్‌కే దక్కుతుందన్నారు. రాజ్యాంగ రచనా కమిటీకి అంబేద్కర్‌ చైర్మన్‌ కావడం మూలంగా ఆయన క్రిడిట్‌ ఆయనకు దక్కిందన్నారు.

అలాగే భారత్‌ తరఫున నోబెల్‌ బహుమతి పొందిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది బ్రాహ్మణులని అని ఆయన గుర్తుచేశారు. అలాగే ఇటీవల ఆ బహుమతి గెలుచుకున్న అబిజిత్‌ బెనర్జీ కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారని పేరొన్నారు. కాగా స్పీకర్‌ వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని మండిపడుతున్నారు. రాజేంద్ర త్రివేది మాట్లాడుతున్న సమయంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, డిప్యూటీ సీఎంలు అదే వేదికపై ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు