కాంగ్రెస్‌కు టీజేఎస్, టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతు

3 Oct, 2019 08:26 IST|Sakshi

నామినేషన్‌ తిరస్కరణతో ఎటూ తేల్చని సీపీఎం

రేపు హుజూర్‌నగర్‌ రానున్న మంత్రి కేటీఆర్, కోదండరాం

నేడు నామినేషన్ల ఉపసంహరణ

కొందరు ఇండిపెండెంట్లను బుజ్జగించిన ప్రధాన పార్టీలు

సాక్షి, సూర్యాపేట: హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక అంకం నామినేషన్ల ఉపసంహరణకు చేరుకుంది. ఈ ప్రక్రియతో ఈ ఎన్నికల బరిలో ఎంతమంది ఉన్నారో నేడు (గురువారం) తేలనుంది. బలమైన కొందరు ఇండిపెండెంట్లను ప్రధాన పార్టీ లు బుజ్జగించాయి. నామినేషన్‌ ఉపసంహరించుకొని తమతో ప్రచారం నిర్వహించా లని చర్చలు జరిపాయి. ఇక ఉప ఎన్నికతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారాయి. టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ ఇప్పటికే ప్రకటించగా, కాంగ్రెస్‌కు తమ మద్దతని తెలం గాణ జన సమితి తేల్చి చెప్పింది. తమ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణతో సీపీఎం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నువ్వా..నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. 

హస్తం వైపు టీజేఎస్‌..
ఉప ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ సీపీఐ, టీజేఎస్‌ నేతలతో మంతనాలు చేసింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ రెండు పార్టీలు ఆందోళన చేస్తున్నాయని, తమకు మద్దతు తప్పకుండా లభిస్తుందని కాంగ్రెస్‌ ఆశించింది. సీపీఐతో టీఆర్‌ఎస్‌ కూడా చర్చలు చేయడంతో ఆ పార్టీ.. టీఆర్‌ఎస్‌కే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇక మిగిలిన టీజేఎస్‌ పలుమార్లు రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమై చివరకు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు నిర్ణయం వెలువరించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ఈ నెల 4న హుజూర్‌నగర్‌ రానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంట్ల ధర్మార్జున్‌ తెలిపారు. నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమై కాంగ్రెస్‌కు మద్దతుగా చేయాల్సిన ప్రచార ప్రణాళికపై చర్చించనున్నట్లు తెలిసింది. టీజేఎస్‌ మద్దతు ఇవ్వడంతో తమ బలం మరింత పెరిగిందని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్‌కు లాభిస్తుందని చర్చించుకుంటున్నారు. 

కారెక్కిన.. కంకికొడవలి..
టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి ప్రకటించారు. తమ పార్టీకి ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ నేతలు.. సీపీఐ నేతలతో చేసిన చర్చలు సఫలమయ్యాయి. గత ఎన్నికలతో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలమయ్యాని అప్పటికి, ఇప్పటికి క్షేత్రస్థాయిలో తమ బలం పెరిగిందని విజయం తమదేనని టీఆర్‌ఎస్‌ ధీమాగా ఉంది. సీపీఐతో పాటు మాలమహానాడు కూడా పార్టీకి మద్దతు తెలపడంతో మెజార్టీ పెరుగుతుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఈ నెల 4న పురపాలక, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హుజూర్‌నగర్‌లో రోడ్డు షోకు హాజరవుతున్నారని, నియోజవర్గ వ్యాప్తంగా శ్రేణులు తరలిరావాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ రోడ్డు షోలో సీపీఐ, మాల మహానాడు నేతలు కూడా పాల్గొనున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన కొంతమంది నియోజకవర్గ నేతలు కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలిసింది. 

బీజేపీ..టీడీపీ ఒంటరి పోరు..
భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగాయి. ఈ రెండు పార్టీల నేతలు ఏ గ్రామం, మండల కేంద్రాల్లో తమ వాస్తవ బలం ఎంత ఉందో అంచనావేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రచారం అస్త్రంగా బీజేపీ చేసుకుంది. బరిలో ఉన్న అభ్యర్థి సామాజిక వర్గం ఓట్లు నియోజకవర్గంలో భారీగా ఉన్నాయని, ఈ ఓట్లతో పాటు ఇతర కులాల ఓట్లు తమ గెలుపునకు నాంది అని ఆపార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. టీడీపీకి ఎన్ని ఓట్లు పడతాయన్నది రాజకీయంగా చర్చ సాగుతోంది. సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావు నామినేషన్‌ తిరస్కరణ కావడంతో పార్టీ నిర్ణయమేంటో తేల్చలేదు. జిల్లా నేతల అభిప్రాయం తీసుకొని రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిసింది. 

బలమైన ఇండిపెండెంట్లకు బుజ్జగింపులు..
గత ఎన్నికల్లో పోటీ చేసి తమ విజయావకాశాలు దెబ్బ కొట్టడం, గెలిచినా మెజార్టీకి గండికొట్టిన బలమైన ఇండిపెండెంట్లు కొందరిని ప్రధాన రాజకీయ పార్టీలు బుజ్జగించినట్లు సమాచారం. ఈ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుండడంతో విజయంతో పాటు మెజార్టీని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 31మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందితే ఇందులో 18మంది ఇండిపెండెంట్లు కాగా, 13మంది రాజకీయ పార్టీల అభ్యర్థులు. ఇండిపెండెంట్లలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఎక్కవ ఓట్లు పడిన వారిని తమ వైపునకు రావాలని బుజ్జగించి నామినేషన్‌ ఉపసంహరించుకునేందుకు వారితో రాజకీయ పార్టీల నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే నామినేషన్ల ఉపసంహరణతో ఎంతమంది బరిలో ఉండనున్నారో గురువారం తేలనుంది.  

మరిన్ని వార్తలు