బెంగాల్‌లో 43 మంది వైద్యుల రాజీనామా

14 Jun, 2019 15:03 IST|Sakshi

సాక్షి, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో డాక్టర్ల నిరసన సెగలు ఇంకా చల్లారడం లేదు. జూనియర్‌ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు మద్దతుగా శుక్రవారం బెంగాల్‌ ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న 43 మంది వైద్యులు రాజీనామా చేశారు. జూనియర్‌ వైద్యుడిపై దాడికి నిరసనగా జూనియర్‌ వైద్యులు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. సమ్మె విరమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించినప్పటికీ వాటిని వైద్యులు బేఖాతరు చేశారు. తమకు రక్షణ కల్పించాల్సిందేనంటూ పట్టుబట్టారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో డాక్టర్లు సమ్మెను తీవ్రతరం చేశారు.

ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆర్‌జీకర్‌ మెడికల్‌ కాలేజీకి చెందిన 16 మంది వైద్యులు తమ రాజీనామాను ప్రభుత్వ ఆరోగ్యశాఖకు అందించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మా భాధ్యతలను నిర్వర్తించలేమని’ డాక్టర్లు లేఖలో పేర్కొన్నారు. వారితో పాటు డార్జిలింగ్‌లోని నార్త్‌ బెంగాల్‌ మెడికల్‌ కాలేజీకి చెందిన 27 మంది వైద్యులు శుక్రవారం రాజీనామాను సమర్పించారు. వైద్యుల నిరసనకు మద్దతుగా  ప్రముఖ  ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డా. సాయిబాల్‌ ముఖర్జీ ,సూపరిండెంట్‌ కం. వైస్‌ ప్రిన్సిపాల్‌  సౌరభ్‌ ఛటోపద్యాయ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యూకేషన్‌( డీయంఈ) కి రాజీనామాను సమర్పించారు.

అత్యవసర సేవలు మాత్రమే..
ఔట్ పేషెంట్ మరియు అత్యవసర విభాగాల్లో విధులు  నిర్వహించాల్సిందిగా డీయంఈ ప్రొఫెసర్ డా. ప్రదీప్ కుమార్ డే అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాల్‌,  డైరెక్టర్లకు గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. జూనియర్‌ డాక్టర్ల సమ్మెతో అన్ని ప్రభుత్వ రంగ వైద్య కళాశాలలు,  ప్రైవేటు ఆసుపత్రులలోనూ అత్యవసర సేవలు మినహా  సాధారణ సేవలు నిలిచిపోనున్నాయి.  శుక్రవారం ఉదయం నిల్ రతన్ సర్కార్ (ఎన్‌ఆర్‌ఎస్) మెడికల్ కాలేజీ, హాస్పిటల్ సహా ఒకటి , రెండు ఆసుపత్రులలో అత్యవసర సేవలు  మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు