'ఆమె పోటీకే రారు.. వస్తే నా చేతిలో ఓటమి ఖాయం'

10 Jan, 2018 08:55 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష పదవికి మీడియా ఎంట్రపెన్యూర్, టెలివిజన్‌ సలహాదారు ఓప్రా విన్‌ఫ్రీ ‘గట్టిగా యోచిస్తున్నారని’ ఆమె సన్నిహిత మిత్రులిద్దరు చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ఆమె కచ్చితంగా అధ్యక్ష రేసులో ఉండరని, ఒక వేళ ఉన్నా ఆమె తన చేతిలో ఓడిపోతారని, తానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బీవర్లీహిల్స్‌లో గోల్డెన్‌ గ్లోబ్స్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ఓఫ్రా పాల్గొని ఉత్తేజపూరిత ప్రసంగం చేసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత విన్‌ఫ్రీ వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తారన్న ఊహాగానాలు ఊపుందుకున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ అంశాన్ని కొన్ని నెలల క్రితం ఓప్రా ప్రస్తావించారని తమ పేరు వెల్లడించడానికి ఇష్టపడని అమె మిత్రులిద్దరు చెప్పారు. కాగా, దీనిపై వ్యాఖ్యానించేందుకు విన్‌ఫ్రీ అధికార ప్రతినిధి మాత్రం నిరాకరించారు. అయితే, ఈ విషయంపై ట్రంప్‌ మాత్రం వెంటనే స్పందించారు. 'ఓఫ్రాను నేను ఇష్టపడతాను. ఆమె అధ్యక్ష బరిలో దిగుతుందని నేను అనుకోవడం లేదు. ఆమె నాకు బాగా తెలుసు. ఓసారి ఆమె నిర్వహించిన కార్యక్రమంలో కూడా నేను పాల్గొన్నాను. ఒక వేళ ఆమె నిజంగానే బరిలోకి దిగితే నేను కచ్చితంగా ఓఫ్రాను ఓడిస్తాను' అని ట్రంప్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు