కర్ణాటక ఎన్నికల తేదీ లీక్‌ : ఈసీ కొరడా

27 Mar, 2018 20:33 IST|Sakshi

బీజేపీ నేత మాలవీయపై చర్యలకు రంగం సిద్ధం

కమిటీ ఏర్పాటుచేసిన ఈసీ, సీబీఐ, ఐబీ దర్యాప్తుకు అవకాశం

సాక్షి, న్యూఢిల్లీ : ఈసీ వెల్లడించకముందే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను బయటపెట్టిన  బీజేపీ ఐటీ సెల్‌ ఇన్‌ఛార్జ్‌ అమిత్‌ మాలవీయపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ విషయమై దర్యాప్తు జరిపేందుకు అధికారులతో కూడిన కమిటీ ఏర్పాటుచేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై సీబీఐ, ఇంటెలిజెన్స్‌ బ్యూరోతో దర్యాప్తు చేయించాలని ఈసీ భావిస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘంలోని సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటుచేశామని, దీనిపై ఏడురోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వనుందని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. 

కర్ణాటక ఎన్నికల తేదీలను మాలవియా ముందే వెల్లడించడం పెనుదుమారం రేపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓం ప్రకాష్‌ రావత్‌ కర్ణాటక ఎన్నికల తేదీలను ప్రకటించకముందే మాలవీయ మే 12న పోలింగ్‌ జరుగుతుందని, మే 18న ఓట్ల లెక్కింపు చేపడతారని ట్వీట్‌ చేశారు.

రావత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తున్న క్రమంలో ఇదే అంశంపై మీడియా ప్రతినిధులు ఆయన వివరణను కోరగా.. ఇది తీవ్రమైన వ్యవహారమని, దీనికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మాలవీయ ట్వీట్‌ చేసిన వివరాలకు దగ్గరగా ఎన్నికల తేదీలున్నాయి. అయితే కౌంటింగ్‌ మాత్రం మే18కి బదులు మే15న చేపడతామని ఈసీ పేర్కొంది. తన ట్వీట్‌ వివాదానికి కేంద్రబిందువు కావడంతో కొద్దినిమిషాల అనంతరం మాలవీయ దాన్ని తొలగించారు. ఈసీ కంటే ముందే పోల్‌ షెడ్యూల్‌ను బీజేపీ ఐటీ చీఫ్‌ అమిత్‌ మాలవీయ ట్వీట్‌ చేయడంపై కాంగ్రెస్‌ స్పందించింది. బీజేపీ సూపర్‌ ఎన్నికల కమిషన్‌గా వ్యవహరిస్తోందని ఆ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జీవాలా మండిపడ్డారు. 
 

మరిన్ని వార్తలు