‘కేసీఆర్‌ రైతుబంధు’గా పేరు పెట్టాలి

12 Mar, 2020 03:38 IST|Sakshi

కేసీఆర్‌ తెచ్చిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం

విమర్శలు చేసేవారు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలి

అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, పంట సీజన్‌ రాగానే రైతుల అకౌంట్లలో పెట్టుబడి సాయం పడుతోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. దీంతో రైతులు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లడం మానేశారని, వ్యవసాయాన్ని వదిలేసిన వారు కూడా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా  ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఎంతగానో ఆలోచించి ఇలాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చారని, ఈ పథకం స్ఫూర్తితోనే కేంద్రం కూడా ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని తెచ్చిందన్నారు.

ఇలా దేశానికి స్ఫూర్తిదాయకమైన ఈ పథకానికి ‘కేసీఆర్‌ రైతుబంధు’గా నామకరణం చేయాలని పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ చివరి ఆయకట్టు కావడంతో తమ నియోజకవర్గమైన భూపాలపల్లికి 31 ఏళ్ల కిందట కాలువలు తవ్వినా ఒక్క రోజు కూడా నీళ్లు రాలేదన్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో కాకతీయ కాలువలో 150 రోజుల నుంచి నీళ్లు పారుతున్నాయన్నారు. విమర్శలు చేసే వారంతా ఈ ప్రాజెక్టును చూస్తే వారి అభిప్రాయం మారిపోతుందన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ ఎమ్మెల్యేలు ఓసారి ప్రాజెక్టును చూసి రావాలని సూచించారు. ధాన్యం ఇతర పంటలను ఎక్స్‌పోర్టు చేసేందుకు రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్నారు. 

ఎన్నికలు ముగిశాక కూడా కొత్త పథకాలు 
బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేశారని, పట్టణాభివృద్ధికి చర్యలు వేగవంతం చేశారన్నారు. వరంగల్‌ లాంటి పట్టణాల్లో ఐటీ విస్తరణకు మంత్రి కేటీఆర్‌ విశేష కృషి చేస్తున్నారు. ఏ ప్రభుత్వాలైనా ఎన్నికల ముం దు పథకాలు తీసుకురావడం సాధారణమని, కేసీఆర్‌ మాత్రం ఎన్నికలు పూర్తయ్యాక కూడా కొత్తపథకాలు తెస్తున్నారన్నారు. సరిపడా విద్యుత్, నీరు అందుబాటులో ఉండటం వల్ల భూములు అమ్మకుండా వ్యవసాయం చేస్తు న్నారని పేర్కొన్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా భూమి లభించట్లేదన్నారు. 

మరిన్ని వార్తలు