ట్రిపుల్‌ తలాక్‌.. రేపు కీలక పరిణామం

21 Dec, 2017 12:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇస్లాం మతానికి సంబంధించి వివాదాస్పదంగా మారిన ట్రిపుల్‌ తలాక్‌ వ్యవహారంపై రేపు కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. లోక్‌సభలో డ్రాఫ్ట్‌ బిల్లును కేంద్రం ప్రవేశపెడుతోంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్‌ తెలిపారు.

లోక్‌సభ అధికారిక వెబ్‌ సైట్‌లో ది ముస్లిం ఉమెన్‌ బిల్లు(వివాహ హక్కుల చట్టం)-2017 పేరిట ఓ ప్రకటనను కూడా ఉంచింది. బిల్లు ప్రకారం తలాక్ ఏ రూపంలో ఉన్నా నేరమే. అందుకు గరిష్టంగా మూడేళ్ల శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 15నే ఈ డ్రాఫ్ట్ బిల్లుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది కూడా. ఇక తన పార్టీ ఎంపీలందరికీ బీజేపీ ఇప్పటికే విప్‌ జారీ చేసింది. వివాదాస్పదమైన అంశం కావటంతో ప్రతిష్టాత‍్మకంగా తీసుకుని తప్పనిసరిగా రావాలంటూ ఎంపీలకు సూచించింది. 

ట్రిపుల్‌ తలాక్‌ను చట్టవిరుద్దంగా పేర్కొంటూ ఆగష్టు 22న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అవసరమైన చట్టం రూపకల్పన చేయాలని కేంద్రానికి సూచించగా.. ఇప్పుడు కేంద్రం ఆ పని చేయబోతుంది. ముస్లిం మహిళల గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా బిల్లును రూపొందించామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్‌ ఇది వరకే తెలిపారు కూడా. అయితే మత పెద్దల అభిప్రాయాలను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు