మంత్రి కిడారితో రాజీనామా చేయించండి

9 May, 2019 04:02 IST|Sakshi

సీఎంవోకు గవర్నర్‌ కార్యాలయం ఆదేశం!

చట్ట సభలకు ఎన్నిక కాకుండానే మంత్రిగా కొనసాగుతున్న శ్రావణ్‌కుమార్‌

రేపటికి ఆరు నెలలు పూర్తి

సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమ, ప్రాథమిక విద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌తో రాజీనామా చేయించాలని గవర్నర్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడినట్టు తెలిసింది. శ్రావణ్‌కుమార్‌ ఇటు అసెంబ్లీకి గాని, అటు శాసన మండలికి గాని ఎన్నిక కాకుండానే మంత్రిపదవి చేపట్టారు. రాజ్యాంగం మార్గదర్శక సూత్రాల ప్రకారం ఎవరైనా మంత్రిగా పదవి చేపట్టిన తరువాత ఏ చట్టసభకైనా (అసెంబ్లీ లేదా మండలి) సభ్యునిగా ఎన్నిక కావాల్సి ఉంది. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టి ఈనెల 10వ తేదీ నాటికి ఆరు నెలలు అవుతోంది. ఈ నేపథ్యంలో కిడారి శ్రావణ్‌కుమార్‌ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించాల్సిందిగా గవర్నర్‌ కార్యాలయ వర్గాలు సీఎంవోకు సూచించినట్టు సమాచారం. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

హడావుడి నిర్ణయంతో మంత్రి అయ్యారు
నాలుగున్నరేళ్లు పాటు మంత్రివర్గంలో ముస్లింలు, గిరిజనులకు అవకాశం కల్పించని చంద్రబాబు ఎన్నికలకు ముందు కంటితుడుపు చర్యగా గత ఏడాది నవంబర్‌ 11వ తేదీన కిడారి శ్రావణ్‌కుమార్‌ను, ఫరూక్‌ను మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆ తరువాత ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంతో ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలం ముగిసేంత వరకు ఆయన మంత్రి పదవికి ఢోకా లేదు. కిడారికి మాత్రం టీడీపీ ఆ అవకాశం కల్పించలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే పదవికి పోటీ చేసినప్పటికీ.. ఫలితాలు వెలువడలేదు. ఇదిలావుంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కిడారి సర్వేశ్వరరావు ఆ తరువాత చంద్రబాబు ప్రలోభాలకు లోనై తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. గత ఏడాది సర్వేశ్వరరావును నక్సలైట్లు హతమార్చారు.

విధిలేని పరిస్థితుల్లో ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని అతనికి గిరిజన సంక్షేమం, ప్రాథమిక విద్య, కుటుంబ సంక్షేమ శాఖలను చంద్రబాబు కేటాయించారు. ఇదిలావుంటే.. మంత్రి శ్రావణ్‌కుమార్‌ స్పందిస్తూ గవర్నర్‌ కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం రాలేదని, ముఖ్యమంత్రిని కలిసి ఆయన సూచన మేరకు నడుచుకుంటానని పేర్కొన్నారు. ఐతే, కిడారి గురువారం సీఎంకు రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నుట్లు తెలిసింది. ఆ తరువాత గవర్నర్‌ ఆమోదానికి సీఎం పంపాల్సి ఉంటుంది. మొత్తానికి ఏ చట్ట సభకు ఎన్నిక కాకుండానే ఆరు నెలలపాటు మంత్రి పదవి అనుభవించిన రికార్డు మాత్రం శ్రావణ్‌కుమార్‌కు దక్కుతుంది.

మరిన్ని వార్తలు