నాపై ద్వేషమే వారిని కలుపుతోంది!

4 Jul, 2018 01:31 IST|Sakshi

విపక్షాల ‘మహాకూటమి’పై ప్రధాని విసుర్లు

ప్రతిపక్షాల్ని ఏకం చేసే సత్తా కాంగ్రెస్‌కు లేదు

నేనేమీ షెహన్షాను కాదు.. ప్రజలతో సంభాషిస్తేనే ఆనందం  

న్యూఢిల్లీ: అధికార కాంక్ష, మనుగడ కోసమే ప్రతిపక్షాలన్నీ ఒక పంచకు చేరుతున్నాయని, మోదీపై ద్వేషమే విపక్షాల్ని కూటమిగా కలిపి ఉంచే ప్రధానాంశంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విపక్షాల పరుగంతా ప్రధానమంత్రి పదవి కోసమేనని ఆయన విమర్శించారు. ‘స్వరాజ్య’ ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. విపక్షాల ఐక్యతను అవకాశవాద రాజకీయంగా ప్రధాని అభివర్ణించారు.

తనను పదవి నుంచి ఎలా తప్పించాలన్న ఆలోచన తప్ప ప్రతిపక్షానికి మరో ఎజెండా లేదని ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీజేపీకే ఓటేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీది అస్తిత్వం కోసం పోరాటమని, ఆ పార్టీ అక్రమాల్ని ప్రజలు తిరస్కరించడంతో పదవి కోసం మిత్రపక్షాల సాయాన్ని అర్ధిస్తోందని మోదీ ఎద్దేవా చేశారు.  

కర్ణాటకలో అవకాశవాద పొత్తు
‘కాంగ్రెస్‌ ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారింది. బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసే శక్తి ఆ పార్టీకి లేదు. రాబోయే ఎన్నికలు పరిపాలన, అభివృద్ధికి.. గందరగోళ రాజకీయాలకు మధ్య పోరుగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు.

ఏ ఎన్నికల్లోనైనా సైద్ధాంతికంగా పొసగని పార్టీల మధ్య అవకాశవాద పొత్తులు గందరగోళానికి దారితీస్తాయని.. అందుకు కర్ణాటకనే ఉదాహరణ అని చెప్పారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి ప్రజా తీర్పును సైతం తిరస్కరించిందని ప్రధాని తప్పుపట్టారు. ఎవరైనా ఇద్దరు మంత్రులు అభివృద్ధిపై చర్చించేందుకు సమావేశమవుతారని, కర్ణాటకలో మాత్రం తగవులాట కోసం కలుసుకుంటున్నారన్నారు.  

ప్రధాని పదవి కోసమే తాపత్రయం
1977, 1989 నాటి ప్రతిపక్షాల ఐక్యతతో.. ప్రస్తుత ప్రతిపక్షాల కూటమి రాజకీయాల్ని పోల్చడం హాస్యాస్పదమన్నారు. ‘ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు 1977లో ప్రతిపక్షాలు చేతులు కలిపాయి. 12 ఏళ్ల తర్వాత బోఫోర్స్‌ కుంభకోణం దేశానికి అప్రతిష్ట తీసుకొచ్చిన వేళ మళ్లీ ప్రతిపక్షాలు ఏకమయ్యాయి.

ప్రస్తుతం ప్రతిపక్షాలు దేశ ప్రయోజనం కోసం కాకుండా వ్యక్తిగత స్వార్థం, అధికార దాహంతో కలిసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మోదీని తప్పించడం తప్ప వారికి వేరే అజెండా లేదు. ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్ధమని ఒకవైపు రాహుల్‌ గాంధీ చెపుతుంటే.. మరోవైపు తృణమూల్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కూడా ఆ పదవిని కోరుకుంటున్నారు.

ప్రధాని అయ్యేందుకు తమ నేతకే అన్ని అర్హతలు ఉన్నాయని సమాజ్‌వాదీ పార్టీ భావిస్తోంది. వీరి దృష్టంతా ప్రజా సంక్షేమంపై కాకుండా అధికార కాంక్షపైనే ఉంది’ అని మోదీ తప్పుపట్టారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సరిపడా స్థానాలు గెలుచుకున్నా.. మిత్రపక్షాలకు తగిన గౌరవం ఇచ్చిన వాటిని ప్రభుత్వంలో భాగం చేసుకున్నామని.. 20కి పైగా పార్టీలతో ఎన్డీఏ ఒక కుటుంబంలా కలిసి మెలిసి ఉందన్నారు.


నేనేం చక్రవర్తిని కాదు
రోడ్డుకిరువైపులా ప్రజలు అభివాదం చేస్తుంటే.. స్పందించకుండా ఉండేందుకు తానేమీ షెహన్షాను కానని ప్రధాని చెప్పారు. ప్రజలతో సంభాషిస్తుంటే తనకు చెప్పలేనంత బలం వస్తుందన్నారు. ‘నేను ఎక్కడికైనా వెళ్లినప్పుడు చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు అభివాదం చేసేందుకు, ఆహ్వానించేందుకు వస్తుంటారు.

అటువంటి వాళ్లను చూస్తూ నేను కారులో కూర్చొని ఉండలేను. అందుకే వారి కోసం కారు దిగి వెళ్లి వారితో మాట్లాడతా’ అని చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మోదీకి ప్రాణహాని ఉందని ఇటీవల నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌లో సుపరిపాలన సాధించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని మోదీ చెప్పారు.

మరిన్ని వార్తలు