చౌకీదార్‌.. నామ్‌దార్‌

13 Apr, 2019 03:59 IST|Sakshi
గంగావతిలో గదతో మోదీకి సత్కారం

ఎవరు కావాలో దేశ ప్రజలే తేల్చుకోవాలి

కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీపై ప్రధాని మోదీ విమర్శలు

మహారాష్ట్ర, కర్ణాటకలో ఎన్నికల ప్రచారం 

గదాధరుడు

అహ్మద్‌నగర్‌ / గంగావతి: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. నిజాయితీపరుడైన చౌకీదార్‌(కాపలాదారు) కావాలో, లేక అవినీతిపరుడైన నామ్‌దార్‌(గొప్ప పేరున్న వ్యక్తి) కావాలో తేల్చుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఐదేళ్లలో ప్రజలు తన పాలనను చూశారన్న మోదీ, దేశ భవిష్యత్తు ఎటు వెళ్లాలో ప్రజలే నిర్ణయించాలని కోరారు. మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో శుక్రవారం బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ, విపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు.

సుస్థిర ప్రభుత్వాన్ని అందించాం
‘సుస్థిరమైన మా ప్రభుత్వం ధైర్యంగా పలు నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రజలు గమనించారు. కానీ రిమోట్‌ కంట్రోల్‌ యూపీఏ పాలనలో కుంభకోణాలు, కీలక అంశాల్లో జాప్యం అన్నవి నిత్యకృత్యంగా ఉండేవి. తరచుగా జరిగే బాంబు దాడుల్లో రైతులు, మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులు చనిపోయేవారు. రైళ్లు, బస్సుల్లో బాంబులు పేలేవి. కానీ చౌకీదార్‌ పాలనలో బాంబు పేలుళ్లు లేవు. ఎందుకో తెలుసా? చిన్నతప్పు చేసినా దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న భయాన్ని ఉగ్రవాదులకు అర్థమయ్యేలా ఈ చౌకీదార్‌ చేశాడు. ఉగ్రవాదుల ఇళ్లలో దూరి వారిని హతమార్చేందుకు ఈ చౌకీదార్‌ అనుమతించాడు’ అని వ్యాఖ్యానించారు.

విదేశీ కళ్లద్దాలతో ఎన్సీపీ చూస్తోంది..
‘కశ్మీర్‌కు ప్రత్యేకంగా ప్రధాని ఉండాలంటున్నవారికి కాంగ్రెస్, ఎన్సీపీలు మద్దతు ఇస్తున్నాయి. కాంగ్రెస్‌ తన ఆలోచనాశక్తిని ఎప్పుడో కోల్పోయింది. కాబట్టి వారిపై నాకు ఎలాంటి ఆశలు లేవు. కానీ శరద్‌ పవార్‌(ఎన్సీపీ అధినేత) దేశం కోసం కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చారు. శరద్‌ రావ్‌.. ఇద్దరు ప్రధానుల డిమాండ్‌పై మీరెందుకు మౌనంగా ఉన్నారు? ఇది మీకు ఆమోదయోగ్యమేనా? మీ పార్టీ పేరు రాష్ట్రవాది. కానీ మీరు కాంగ్రెస్‌తో కలిసి దేశాన్ని విదేశీ కళ్లద్దాలతో చూస్తున్నారు’ అని విమర్శించారు. కర్ణాటకను ప్రస్తుతం ‘20 శాతం కమీషన్‌ ప్రభుత్వం’ పాలిస్తోందని మోదీ ఎద్దేవా చేశారు. కొప్పళ జిల్లాలోని గంగావతిలో జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ మోదీ మాట్లాడారు.  ‘రెండు పూటలా భోజనానికి గతిలేని వారు మాత్రమే సైన్యంలో చేరతారని కర్ణాటక సీఎం కుమారస్వామి మాట్లాడటం సిగ్గుచేటు. ఈ వ్యాఖ్యలతో సైనికుల ఆత్మస్థైర్యాన్ని ఆయన దెబ్బతీశారు’ అని అన్నారు.

మరిన్ని వార్తలు