‘బీజేపీ అధ్యక్షుడిని నెట్టివేయలేదు’

5 Nov, 2018 10:52 IST|Sakshi

న్యూఢిల్లీ: యమునా నదిపై నిర్మించిన సిగ్నేచర్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)ల మధ్య వివాదానికి కేంద్రంగా మారింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ, ఆప్‌ల నాయకులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి వెళ్లిన తనను అమానతుల్లా ఖాన్‌ తనను నెట్టివేసాడని పార్లమెంట్‌ సభ్యుడు, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ ఆరోపించారు. తివారీ వ్యాఖ్యలపై స్పందిచిన ఖాన్‌ ఆ వ్యాఖ్యలను ఖండించారు. తివారీ స్టేజ్‌ ఎక్కేందుకు ప్రయత్నించగా తాను అడ్డుకున్నట్టు తెలిపారు. అంతేకానీ అతన్ని నెట్టివేయలేదని వెల్లడించారు. ఒకవేళ తివారీ స్టేజ్‌పైకి వెళితే.. అతను సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తోపాటు, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాలతో అమర్యాదగా ప్రవర్తించేవారని.. అతని చర్యలు అనుమానించేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. 

ఈ కార్యక్రమానికి తివారీని ఆహ్వానించలేదని ఆయన తెలిపారు. కానీ సిగ్నేచర్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ఆయన తన అనుచరులతో వచ్చారని అన్నారు. అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు ఆప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు.. తమ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తివారీ స్టేజ్‌కు సమీపంలోకి వచ్చినా పోలీసులు అతన్ని అడ్డుకోలేదని ఖాన్‌ అన్నారు.

అంతకుముందు ఈ ఘర్షణపై తివారీ స్పందిస్తూ.. సిగ్నేచర్‌ బ్రిడ్జి ప్రారంభ కార్యక్రమంలో అమానతుల్లా ఖాన్‌ తనను నెట్టివేసాడని ఆరోపించారు. ఇదంతా సీఎం కేజ్రీవాల్‌ సమక్షంలోనే జరిగిందని అన్నారు. ఖాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఇది తన నియోజకవర్గంలో(ఈశాన్య ఢిల్లీ​) జరగుతున్న కార్యక్రమం అని.. చాలా కాలంగా ఆగిపోయిన బ్రిడ్జి పనులను తానే తిరిగి ప్రారంభించానని అన్నారు. 

ఈ వివాదంపై కేజ్రీవాల్‌ ట్విటర్‌లో ఘాటుగా స్పందించారు. గతంలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని అన్నారు. బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో గందరగోళం సృష్టించారని ఆరోపించారు. ఇది ఢిల్లీ ప్రభుత్వ కార్యక్రమం అని తెలిపారు. ఇక్కడ ఘర్షణ జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. ఢిల్లీ పోలీసులను పర్యవేక్షించే లెఫ్టినెంట్‌ గవర్నర్‌పై శాంతి, భద్రతలను కాపాడాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు