సమస్యలేమైనా ఉంటే చెప్పండమ్మా

19 Jun, 2018 13:23 IST|Sakshi
మహిళలతో ముచ్చటిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

ఏపూరులో కారుదిగి.. మహిళలతో కూర్చొని..

ముచ్చటించిన మంత్రి జగదీశ్‌రెడ్డి సమస్యలపై ఆరా

ఆత్మకూర్‌–ఎస్‌ (సూర్యాపేట) : ‘అమ్మా.. పింఛన్లు అందుతున్నాయా.. గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణం ఎలా ఉంది.. సమస్యలేమైనా ఉంటే నాదష్టికి తీసుకురండి’ అని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మహిళలకు సూచించారు. సోమవారం ఆత్మకూర్‌ (ఎస్‌) మండలం బొప్పారంలో సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం తిరుగుప్రయాణంలో ఏపూరులోని ఎస్సీ కాలనీ సమీపంలో మహిళలు ఒక్క చోట కూర్చోవడాన్ని చూసి కారు దిగి వారివద్దకు వెళ్లి ముచ్చటించారు.

అక్కడ ఉన్న అవిరె క్రిష్ణవేణి, మార్త అనసూర్యలను పలకరిస్తూ ‘మీ చేతులో సెల్‌ఉంది కదా ఏదైనా సమస్య ఉంటే నా దష్టికి తీసుకురమ్మని చెప్పాను.. ఎలాంటి సమస్యలు లేవా.. గతంలో మంచి నీటి సమస్య ఉందని నా దష్టికి తీసుకువచ్చారు.. ఇప్పుడు ఎలా ఉంది అని’ మంత్రి అడిగారు. ఎలాంటి సమస్యా లేదని మహిళలు సమాధానం ఇచ్చారు. భూములు పట్టాకావడం లేదని.. అధికారుల చుట్టూ తిరిగినా పనులు కావడం లేదని అవిరె క్రిష్ణవేణి మంత్రి దష్టికి తీసుకువచ్చింది.

పక్కనే ఉన్న ఆర్‌ఐతో మాట్లాడిన మంత్రి .. వారం రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందన్నారు. మంత్రి స్వయంగా వచ్చి తమతో కలిసి కూర్చొని సమస్యలను అడగడంతో మహిళలు ఆశ్చర్యానికి గురయ్యారు. అంతకుముందు బొప్పారంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు పగడాల క్రిష్ణారెడ్డి ని పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో క్రిష్ణారెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు.

 

మరిన్ని వార్తలు