టీడీపీకి జనసేన హెల్ప్‌.. చివరినిమిషంలో అభ్యర్థి మార్పు!

19 Mar, 2019 11:37 IST|Sakshi

సాక్షి, గుంటూరు : టీడీపీ - జనసేన పార్టీల మధ్య అంతర్గతంగా పరస్పర అవగాహన మేరకు టికెట్ల కేటాయింపు చేసుకుంటున్నాయన్న విషయం ఆయా పరిణామాలను బట్టి మరింత తేటతెల్లమవుతోంది. జనసేన పార్టీకి ఇబ్బంది కలుగకుండా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పలుచోట్ల అభ్యర్థులను ప్రకటించినట్టు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అదే తరహాలో జనసేన సైతం లోపాయకారిగా టీడీపీ అభ్యర్థులకు నష్టం కలగకుండా అభ్యర్థుల ఎంపికను ఆచితూచి చేస్తోంది. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అధినేత, ఏపీ మంత్రి లోకేశ్‌పై జనసేన నేరుగా అభ్యర్థిని నిలబెట్టకుండా ఆ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. నిజానికి సీపీఐ బలమున్న మరో స్థానాన్ని కోరుకున్నప్పటికీ ఒప్పించి మరీ ఆ స్థానం కేటాయించినట్టు సమాచారం. స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేశ్ పోటీ చేస్తున్న కారణంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంలో ప్రచారం కూడా నిర్వహించరాదని ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్టు ప్రచారం జరుగుతోంది. జనసేన అభ్యర్థి పోటీ చేసిన పక్షంలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి రాలేదన్న విమర్శ ఎదురవతుందని, సీపీఐకి కేటాయించడంతో పాటు సమయాభావం కారణంగా వెళ్లలేకపోయారని, ఒకవేళ పవన్ ప్రచారం నిర్వహించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన విమర్శలు గుప్పించాలే తప్ప లోకేశ్ గురించి పల్లెత్తు మాట మాట్లాడకూడదన్న అంగీకారం కుదిరినట్టు స్థానికంగా ఉంటుందన్న ఇరు పార్టీల నుంచి వినిపిస్తోంది.

ఇకపోతే, గుంటూరు జిల్లా రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ప్రయోజనాలకు భంగం కలుగకుండా జనసేన ఏకంగా అభ్యర్థినే మార్చేయడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావుకు జనసేన మొదట సీటు కేటాయించనున్నట్టు ప్రచారం జరిగింది. అయితే, చివరి నిమిషంలో మరో పేరును ఆ పార్టీ తెరపైకి తేవడం గమనార్హం. ఈనియోజకవర్గం నుంచి చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకుని కవతం సాంబశివరావుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సీటు కేటాయించారని ఆపార్టీ నేతల సమాచారం. టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే సత్యప్రసాద్‌కు ప్రతికూలంగా పరిణమించే ఎలాంటి నిర్ణయం తీసుకోరాదన్న అంతర్గతంగా కుదిరిన అంగీకారం మేరకే చివరి నిమిషయంలో జనసేన అధినేత ఇక్కడి నుంచి అభ్యర్థిని మార్చినట్టు తెలిసింది. ఇలావుండగా, ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తానని కొందరు టీడీపీ నేతలకు హామీ ఇచ్చిన పార్టీ అధినేత చివరి నిమిషంలో మరో పార్టీ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడం పట్ల వారంతా తీవ్రస్థాయిలో రగిలిపోతున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు