వచ్చే ఎన్నికల్లో గులాబీ పీడ విరగడవుతుంది

23 Nov, 2017 00:52 IST|Sakshi

సీఎల్పీ ఉప నేత జీవన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రైతుల ఆత్మహత్యలు పరంపరగా కొనసాగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో సర్కారు ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. రాష్ట్రానికి పట్టిన ‘గులాబీ’ పీడ వచ్చే ఎన్నికల్లో విరగడవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

పంట చేతికొచ్చే సమయంలో వరి, పత్తి దిగుబడి తగ్గిపోయిందని, వర్షానికి తడిసి పత్తి రంగు మారిందని, వరికి దోమపోటు, పత్తి పంటకు గులాబీ చీడ పట్టిందన్నారు. ఆయా పంటల వివరాలు తెప్పించుకుని కేంద్రానికి పంపించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రతిపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకోవడాన్ని సర్కార్‌ నామోషీగా భావిస్తున్నదని అన్నారు. అకాలవర్షాలతో నష్టపోయిన పంటలకు ప్రకృతి వైపరీత్యాల కింద నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గతంలో పంటనష్టం వివరాల నివేదిక కేంద్రానికి పంపకపోవడంతో ఇన్‌పుట్‌ సబ్సిడీ పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు