బీసీలకు బాబు వెన్నుపోటు

27 Apr, 2018 03:00 IST|Sakshi

బీసీ న్యాయవాదులను హైకోర్టు జడ్జిలు కానివ్వకుండా ఎందుకు అడ్డుపడ్డారు?  ఓట్లేయించుకుని  ద్రోహమా?

జస్టిస్‌ ఈశ్వరయ్య ఆరోపణలపై నోరుమెదపని చంద్రబాబు

ఆయన సమాధానమివ్వాల్సిందే: ఆర్‌.కృష్ణయ్య

డిప్యూటీ సీఎం కేఈ ఎందుకు మాట్లాడడంలేదు? : బీజేపీ

సాక్షి, అమరావతి: ‘టీడీపీకి బీసీలే వెన్నుముక.. వారు లేనిదే టీడీపీ లేదు’.. అని పదే పదే నమ్మబలుకుతూ.. ఆ వర్గాల ప్రజలకు నమ్మకద్రోహం చేస్తున్నారంటూ హైకోర్టు రిటైర్డు జడ్జి, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య చేసిన ఆరోపణలకు సీఎం చంద్రబాబు వివరణ ఇవ్వకపోవడంపై రాజకీయ పార్టీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. వెనుకబడిన తరగతులకు చెందిన న్యాయవాదులను.. న్యాయమూర్తులు కానివ్వకుండా ఎందుకు అడ్డుకుపడ్డారని ప్రశ్నిస్తున్నారు.

ఓట్ల కోసం.. సీట్ల కోసం బీసీలను చంద్రబాబు వాడుకుని, ఆ వర్గాల సంక్షేమానికి వచ్చేసరికి వదిలేస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని ఎత్తిచూపుతున్నారు. బీసీ, ఎస్సీ, బ్రాహ్మణ వర్గాలకు చెందిన నలుగురు న్యాయవాదులకు విషయ పరిజ్ఞానం, వ్యక్తిత్వంలేదని.. సచ్ఛీలురు కారని కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖ రాసి, హైకోర్టు జడ్జిలు కానివ్వకుండా సీఎం చంద్రబాబు అడ్డుపడిన తీరును జస్టిస్‌ ఈశ్వరయ్య సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టడం ఆ వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తప్పుడు నివేదికలు ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ వారంతా డిమాండ్‌ చేస్తున్నారు.

చంద్రబాబు సమాధానమివ్వాలి : ఆర్‌.కృష్ణయ్య
ఓట్ల కోసమే బీసీలను వాడుకుంటున్న చంద్రబాబు, ఆ తర్వాత వారి వెన్ను విరుస్తున్నారనడానికి జస్టిస్‌ ఈశ్వరయ్య చేసిన ఆరోపణలు అద్దంపడతున్నాయని బీసీల సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య అభివర్ణించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే జస్టిస్‌ ఈశ్వరయ్య చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే, వెనుకబడిన వర్గాలకు చెందిన న్యాయవాదులను జడ్జిలు కాకుండా ఎందుకు అడ్డుపడ్డారో చెప్పాలంటూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ట్విట్టర్‌లో సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.

తెలివి, పరిజ్ఞానం లేవంటూ బీసీ న్యాయవాదులను జడ్జిలుగా నియమించవద్దని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు లేఖ రాసి.. ఆ వర్గాల ప్రజలపట్ల తనకు ఎంత చిత్తశుద్ధి ఉందన్నది చాటిచెప్పారంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కపిలేశ్వరయ్య ఎద్దేవా చేశారు. బీసీలకు నమ్మకద్రోహం చేసిన సీఎం చంద్రబాబును ఆ వర్గానికే చెందిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.

బీసీలను రాజకీయంగా.. ఆర్థికంగా.. సామాజికంగా దెబ్బతీయడానికి సీఎం చంద్రబాబు కుతంత్రాలు పన్నుతున్నారన్నది మరోసారి తేటతెల్లమైందంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. సామాజికంగా అభివృద్ధి చెందకుండా చేసేందుకే ‘ఆదరణ–2’ పేరుతో కులవృత్తుల పరికరాలు అంటకట్టి, ఆ వర్గాల ప్రజలకు హైకోర్టు జడ్జిలు వంటి ఉన్నత పదవులు దక్కకుండా అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు, ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నిలదీస్తున్నా సీఎం చంద్రబాబు నోరుమెదపకపోవడంలో ఆంతర్యమేమిటని వారంతా ప్రశ్నిస్తున్నారు.

వివాదం ఇదీ..
రాష్ట్రానికి చెందిన న్యాయవాదులు అమర్‌నాథ్‌ గౌడ్, అభినవ్‌కుమార్‌ చావలి, గంగారావు, డీవీ సోమయాజులు, విజయలక్ష్మి, కేశవరావులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు జడ్జిల కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆ ఆరుగురు న్యాయవాదులపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని సీఎం చంద్రబాబును కేంద్ర న్యాయశాఖ కోరింది.

బీసీ వర్గాలకు చెందిన అమర్‌నాథ్‌ గౌడ్, అభినవ్‌ కుమార్‌ చావలి, ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన డీవీ సోమయాజులకు విషయ పరిజ్ఞానం లేదని.. వ్యక్తిత్వం లేదని.. సచ్ఛీలుకారంటూ మార్చి 21, 2017న సీఎం చంద్రబాబు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు లేఖ రాశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన విజయలక్ష్మి, వెలమ వర్గానికి చెందిన కేశవరావులకు అనుకూలంగా నివేదిక పంపారు.

కేంద్ర నిఘా వర్గాల ద్వారా ఆరుగురు న్యాయవాదులపై కేంద్రం ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకుంది. ఆరుగురు న్యాయవాదులకూ న్యాయమూర్తులుగా నియమించవచ్చునని కేంద్ర నిఘా వర్గాలు నివేదిక ఇవ్వడంతో.. ఆ మేరకు కేంద్రం వారిని హైకోర్టు జడ్జిలు నియమించింది. బీసీ, ఎస్సీ, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు చెందిన నలుగురు న్యాయవాదులను న్యాయమూర్తులు కానివ్వకుండా అడ్డుపడేందుకు కేంద్రానికి సీఎం చంద్రబాబు రాసిన లేఖలను సోమవారం జస్టిస్‌ ఈశ్వరయ్య బయటపెట్టడం తీవ్ర సంచలనం రేపింది. సీఎం చంద్రబాబు తీరుపై ప్రధాన రాజకీయ పార్టీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
 
బీసీలు బుద్ధి చెబుతారు
బీసీ న్యాయవాదులు జడ్జిలు కాకుండా వారికి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీసీలు తగిన బుద్ధి చెబుతారు. బీసీ న్యాయవాదులకు జరుగుతున్న అన్యాయాన్ని ఈశ్వరయ్య బయట పెట్టకుంటే దేశానికి తెలిసేది కాదు. ప్రధానమంత్రిగా బీసీ ఉంటే ఆయనను కూడా చంద్రబాబు తిట్టారు.

గ్రామాల్లో పేద బీసీ పిల్లల గురించి సీఎం ఆలోచించడం లేదు. న్యాయవాదులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లు రాకుండా చేస్తున్నారు. ఇటువంటి వ్యవహారాలు చేసే వారిని ప్రజలు క్షమించరు.   – పృథ్వీరాజ్, బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు
 
నిజం కాబట్టే సీఎం స్పందించలేదు
ఈశ్వరయ్య నిజం చెప్పారు కాబట్టి సీఎం స్పందించడంలేదు. బీసీలకు రాజకీయాల్లో సరైన ప్రాతినిధ్యం లేదు. స్థానిక సంస్థల్లో మాత్రమే ఉంది. చట్ట సభల్లో లేదు. ఎంబీసీలకు ఎదుగుదలే లేదు. ముస్లింలకు, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం బీసీలకు అన్యాయం చేయడమే.

ముఖ్యమంత్రి ఎన్నికల్లో 116 వాగ్దానాలు చేశారు. ఒక్కటీ అమలుచేయడంలేదు. ఒకే సామాజికవర్గానికి ఎక్కువ పోస్టులు ఇస్తున్నారు. 2004, 2009, 2014ఎన్నికల్లో బీసీలకు సగం సీట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పారు. 40 సీట్లకు మించలేదు. వైఎస్‌ఆర్‌ 67 మందికి ఇచ్చారు.   – రామకృష్ణయ్య, బీసీ సంఘం నేత     

మరిన్ని వార్తలు