మరో ఉద్యమం తప్పదు.. కమల్‌ హెచ్చరికలు

16 Sep, 2019 14:54 IST|Sakshi

భాష జోలికి రావద్దన్న లోకనాయకుడు

జల్లికట్టు కంటే పెద్ద  ఉద్యమం తప్పదని హెచ్చరిక

సాక్షి, చెన్నై: ఒక దేశం ఒక భాష అంటూ కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ కార్యదర్శి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే అమిత్‌ షా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ సైతం మండిపడ్డారు. తాజాగా మరో తమిళ నేత, మక్కళ్‌నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ తీవ్రంగా స్పందించారు. తమపై హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే మరో ప్రతిఘటన ఎదుర్కొక తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ వీడియోను సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు.

‘ఒక దేశం ఒకే భాష అనే విధానం సరైనది కాదు. భారత్‌ ప్రజాస్వామ్య దేశం కావున ఒక దేశం అనేక భాషలు అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. దేశ జాతీయ గీతం బెంగాళీ భాషలో ఉన్నా.. అది దేశ ఐక్యతను అన్ని రాష్ట్రాలను సంస్కృతిని గౌరవిస్తుంది. కావున దానిని మేమంతా గౌరవిస్తాం. రాష్ట్రాల సంస్కృతి జోలికి కేంద్రం రావడం సరికాదు. గతంలో జల్లికట్టు ఉద్యమాన్ని ఏ విధంగా ఉధృతంగా చేశామో దేశమంతా చూసింది. తమిళ భాష జోలికి వస్తే దానికి కంటే మరింత ఎక్కువగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ కమల్‌ హసన్‌ హెచ్చరించారు. 

కాగా హిందీ దివస్‌ సందర్భంగా అమిత్‌ షా ప్రసంగిస్తూ..భారత్‌లో అత్యధికులు మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యమత్యంగా ఉంచడానికి తోడ్పడుతుందని పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రపంచంలో భారత్‌ గుర్తింపు కోసం ఒక భాష మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉందని, దేశాన్ని ఒక్కటిగా ఉంచే భాష ఏదైనా ఉందంటే అది హిందీ మాత్రమే అని అభిప్రాయపడ్డారు. షా వ్యాఖ్యలపై పలు రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు