కర్ణాటక స్పీకర్‌ రాజీనామా

29 Jul, 2019 12:43 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ కే.ఆర్‌.రమేశ్‌ కుమార్‌ తన పదవికి రాజీనామా చేశారు. గతకొంత కాలంగా రాష్ట్రంలో సాగుతోన్న రాజకీయ సంక్షోభానికి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన స్పీకర్‌ సోమవారం తన పదవి నుంచి తప్పుకున్నారు. అసెంబ్లీలో యుడియూరప్ప విశ్వాస పరీక్షలో విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే ఆయన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సభలోనే ఆయన రాజీనామా లేఖను సభ్యులందరికీ చదవి వినిపించారు. కాగా స్పీకర్‌ రాజీనామాకు ఒక్కరోజు ముందు (ఆదివారం) 14 మంది సభ్యులపై అనర్హత వేటు వేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి.. సభా నియమాలను ఉల్లంఘించినందుకు వారిపై వేటు వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

కాగా కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్‌ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి అనంతరం.. స్పీకర్‌ను దింపేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్‌ కే.ఆర్‌.రమేశ్‌ కుమార్‌ వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని సందేశాన్ని పంపింది. స్వచ్ఛందంగా తప్పుకోకుంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలవంతంగా సాగనంపాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సోమవారం సభలో జరిగిన విశ్వాస పరీక్షలో యడియూరప్ప సర్కార్‌ విజయం సాధించడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో బీజేపీ నూతన స్పీకర్‌ను ఎన్నుకోనుంది.

మరిన్ని వార్తలు