బహిష్కరణ అప్రజాస్వామికం

15 Mar, 2018 02:15 IST|Sakshi

శాసనసభ సభ్యత్వం రద్దుపై సీఈసీకి కోమటిరెడ్డి, సంపత్‌ ఫిర్యాదు

స్పీకర్‌ సహజ న్యాయసూత్రాలను పాటించలేదని వివరణ

ఆ స్థానాలను ఖాళీలుగా నోటిఫై చేయొద్దంటూ కాంగ్రెస్‌ లేఖ

సభ్యత్వం రద్దు వెనుక కుట్ర ఉందని ఆరోపణ

నేడు సీఈసీ వద్దకు కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం

సాక్షి, హైదరాబాద్‌ : తమ సభ్యుల అనర్హత వేటుపై కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమీషన్‌ (సీఈసీ)ను ఆశ్రయించింది. సహజ న్యాయసూత్రాలను పాటించకుండా, అప్రజాస్వామికంగా తమ సభ్యులను స్పీకర్‌ బహిష్కరించారని.. సభ్యత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని బుధవారం ఫిర్యాదు చేసింది. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఎలాంటి న్యాయ సూత్రాలను పాటించకుండా తమను సభ నుంచి పంపించేశారని.. తమకు అన్యాయం జరగకుండా చూడాలని ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు సీఈసీకి ఆన్‌లైన్‌లో సమర్పించిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ నేరుగా ప్రతినిధి బృందంతో సీఈసీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. పార్టీ ఎలక్షన్‌ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం గురువారం ఢిల్లీలోని నిర్వాచన్‌ సదన్‌లో సీఈసీని కలవనున్నారు. ఇక తమ సభ్యత్వం రద్దు విషయంలో కనీస సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని వెంకట్‌రెడ్డి, సంపత్‌లు స్పీకర్‌ మధుసూదనాచారికి లేఖ రాశారు. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కుట్ర.. 
ఇద్దరు కాంగ్రెస్‌ సభ్యుల బహిష్కరణ అంశంపై మర్రి శశిధర్‌రెడ్డి కూడా బుధవారం సీఈసీకి ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ అవుతుందని.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోపాటు వాటికి ఉప ఎన్నికలు జరుగుతాయని మంత్రి హరీశ్‌రావు చెప్పినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయని ఆ లేఖలో వివరించారు. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలవకూడదన్న కుట్రపూరిత ఉద్దేశంతోనే తమ సభ్యుల సభ్యత్వాలను రద్దు చేశారని పేర్కొన్నారు. బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు హైకోర్టు, సుప్రీంకోర్టులను న్యాయం కోసం ఆశ్రయిస్తారని.. అప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సీఈసీని కోరారు. రెండు అసెంబ్లీ స్థానాల ఖాళీని నోటిఫై చేయాలంటూ తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పంపిన లేఖను నిలిపివేయాలని.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ స్థానాలకు ఎలాంటి నోటిఫికేషన్‌ విడుదల చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు