‘చంద్రబాబు చుట్టూ డర్టీ డజన్ నాయకులు’

20 Jul, 2020 13:47 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రజలు కరోనాలో బాధపడుతుంటే చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ టెక్నాలజీస్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బాబు చుట్టూ యనమల రామకృష్ణుడు, సబ్బం హరి లాంటి డర్టీ డజన్ నాయకులు ఉన్నారని, వారితో ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. యనమల కలియుగ శకుని అని తూర్పు జనం అనుకుంటారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ రాజకీయ బిక్షతో స్పీకర్ పదవి పొందిన యనమల చంద్రబాబు మాటలతో వెన్నుపోటు పొడిచాడని మండిపడ్డారు. బాబును చూస్తే భారతంలో దుర్యోధనుడు గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఇప్పటి కాంగ్రెస్‌కి పట్టిన గతే పడుతుందన్నారు. 

విశాఖపై విషం కక్కుతున్న టీడీపీని నిలదీయాల్సిన అవసరం ఉత్తరాంధ్ర జర్నలిస్టులపై ఉందని ప్రసాద్‌రెడడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని యూ టర్న్‌లు తీసుకున్నా ప్రజలు నమ్మరని చెప్పారు. ఆకు రౌడీ సబ్బం, కలియుగ శకుని యనమల పతనం చివర దశలో ఉందన్నారు. మున్సిపల్ స్థలంలో సబ్బం హరి నివాసం ఉంటున్న విషయాన్ని చంద్రబాబు నాయుడే చెప్పిన విషయం అందరికీ తెలుసన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌తో విశాఖ నగరం మరో ముంబై, చెన్నై నగరాల సరసన చేరనుందని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన విశాఖ నుంచి మొదలుపెడితే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు