సామాజిక వ్యాప్తిపై గందరగోళం

20 Jul, 2020 13:59 IST|Sakshi

కోవిడ్‌-19 : సామాజిక వ్యాప్తిపై కొరవడిన స్పష్టత

నగరాలు, పట్టణాల్లోనే అధిక కేసులు

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో కోవిడ్‌-19 సామూహిక వ్యాప్తి దశకు చేరిందనే విషయంలో స్పష్టత కొరవడింది. వైరస్‌ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) చైర్మన్‌ వీకే మోంగా ఆదివారం వెల్లడించారు. ఎవరికి ఎలా వైరస్‌ సోకుతున్నదనేది అంతుచిక్కట్లేదని ఆయన పేర్కొన్నారు. మోంగా ప్రకటనపై ఐఎంఏలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో గందరగోళం నెలకొంది. మోంగా ప్రకటనను ఐఎంఏ అధ్యక్షుడు, కార్యదర్శి ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. మోంగా వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయమని ఐఎంఏకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

కొన్ని నగరాలు, పట్టణాల్లోనే కరోనా వైరస్‌ కేసులు అధికంగా ఉన్నాయని ఐఎంఏ కార్యవర్గం పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి దశలో లేదని తెలిపింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా  40, 421 తాజా పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. వైరస్‌ బారినపడి ఒక్కరోజులోనే 681 మంది మరణించారు. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,18,043కి చేరుకుంది. మృతుల సంఖ్య 27,497కి పెరిగింది. ఇక కరోనా వైరస్‌ నుంచి ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 3,90,000 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చదవండి : కరోనా @11 లక్షలు

మరిన్ని వార్తలు