జమిలి ఎన్నికలు నిర్వహిస్తే మంచిదే : కేటీఆర్‌

19 Jun, 2019 20:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ అవసరమైతే తమ పార్టీ మద్దతు ఉంటుందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి తమ పార్టీ తరఫున అభిప్రాయాన్ని తెలిపానని వెల్లడించారు. బుధవారం పార్లమెంటులోని లైబ్రరీ బిల్డింగ్‌లో వివిధ అంశాలపై ప్రధాని నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో కేటీఆర్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘విడతల వారీగా ఎన్నికలు జరగడంతో పాలన కుంటుపడుతుంది. ఎన్నికల ఖర్చు పెరుగుతుంది. ఎన్నికలలో ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలంటే పరిమిత కాలవ్యవధిలో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే మంచిదే.జమిలి ఎన్నికలు జరిగితే కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్ లు ప్రవేశ పెట్టడం సులభతరమవుతుంది. తద్వారా ఐదేళ్లపాటు ప్రభుత్వ ఫలాలను ప్రజలు పొందే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ అవసరమైతే మద్దతునిస్తాం. రాజకీయ, సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉన్నప్పటికీ వాటిన్నింటికీ అతీతంగా దేశ శ్రేయస్సు కోసం అందరూ కలసి రావాలని ప్రధాని అన్నారు. దేశ హితం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు’ అని వెల్లడించారు.

ఫెడరల్‌ వ్యవస్థ బలోపేతం చేయాల్సిందే..
అఖిలపక్ష సమావేశంలో భాగంగా... ‘స్వాతంత్యం వ‌చ్చి 75 వసంతంలోకి అడుగిడుతున్న నేప‌థ్యంలో నయా భార‌త్ నిర్మాణానికి ఏం చేస్తే బాగుంటుంద‌ని  ప్రధాని అడిగారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆలోచ‌న‌లను ఆయనకు వివ‌రించాం. రాష్ట్రాల‌ను బలోపేతం చేస్తూ, సమాఖ్య వ్యవస్థను బ‌లోపేతం చేస్తేనే దేశం బ‌ల‌పడుతుంద‌ని కుండ‌బ‌ద్దలు కొట్టిన‌ట్లు చెప్పాం. స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, ఉమ్మడి లిస్ట్‌లో ఉన్న అంశాలపై చర్చించాం. ముఖ్యమైన వ్యవసాయం, వైద్యం, విద్య తదితర అంశాలను రాష్ట్రాల‌కు బ‌ద‌లాయించాల‌ని విఙ్ఞప్తి చేశాం. తద్వారా వేగ‌వంతంగా దేశాన్ని అభివృద్ధి చేసుకోవ‌చ్చని సూచించాం అని కేటీఆర్‌ తెలిపారు.

అదే విధంగా మహాత్మా గాంధీ150వ‌ జ‌యంతి ఉత్సవాలను జరపాలనే కేంద్ర నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ స‌యోధ్యతో ప్రతీ రాష్ట్రంలో 150 స్కూల్స్, 150 గ్రామాలు, 150 ఆసుప‌త్రుల‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాల‌తో ఆదర్శవంతంగా అభివృద్ధి చేయాల‌నే ప్రతిపాద‌న‌లు ప్రధాని ముందుంచామని వెల్లడించారు. ఆస్ప్రెషన్ జిల్లాలను ప్రకటించడం కాదు, వాటి అభివృద్ధికోసం కేంద్రం నిధులతో పాటూ, పర్యవేక్షణ అవసరమని ప్రధానికి సూచించామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఫ్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి ఆ జాబితాలో ఉన్నప్పటికీ అభివృద్ధి చెందలేదన్న విషయాన్ని గుర్తు చేసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు