'కేజ్రీవాల్‌.. నువ్వు చనిపోయినవాడితో పెట్టుకోవద్దు'

3 Jan, 2018 15:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఒప్పందాలు పొసగనప్పుడు పార్టీలో కలిసి ముందుకు సాగడం సాధ్యం కాదని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత కుమార్‌ విశ్వాస్‌ అన్నారు. రాముడు, గౌతమ బుద్ధుడితోపాటు ప్రతి ఒక్కరు తమ యుద్ధం తామే చేసుకున్నారని గుర్తు చేశారు. ఢిల్లీ రాజ్యసభ సీట్ల వ్యవహారం గత కొద్ది రోజులుగా చడీచప్పుడు లేకుండా ముందుకెళుతున్న ఆమ్‌ఆద్మీపార్టీలో ఒక్కసారిగా అగ్గిని రాజేసిన విషయం తెలిసిందే. ఈ సీట్ల పంపకం కారణంగా ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన కుమార్‌ విశ్వాస్‌ ఏకంగా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై యుద్ధం ప్రకటించారు. ఢిల్లీకి ఉన్న మూడు రాజ్యసభ సీట్లలో తనకు సీటు కేటాయించకపోవడంపై ఆయన బహిరంగంగా కేజ్రీవాల్‌ను టార్గెట్‌ చేశారు. బుధవారం ఆమ్‌ ఆద్మీపార్టీ ఢిల్లీ రాజ్యసభ స్థానాలకోసం తన అభ్యర్థులను ప్రకటించింది.

ఈ మూడు కూడా ఆప్‌ గెలుచుకునేందుకు అవకాశం ఉన్నవే. సంజయ్‌ సింగ్‌, సుశీల్‌ గుప్తా, ఎన్డీ గుప్తా అనే ముగ్గురుకి రాజ్యసభ సీట్లను కేటాయించింది. ఈ నేపథ్యంలో కుమార్‌ విశ్వాస్‌ మాట్లాడుతూ నిజాలు మాట్లాడినందుకు తనను ఇలా శిక్షించారని అన్నారు. ఇలా జరుగుతుందని కూడా తాను ముందే ఊహించానని అన్నారు. గత ఏడాదిన్నర కిందట తనను చూస్తూ కేజ్రీవాల్‌ ఓనవ్వు నవ్వుతూ తనను రాజకీయంగా దెబ్బకొడతామని అన్నారని చెప్పారు. ఒప్పందాలు కుదరనప్పుడు పార్టీలో కలిసి ఉండటం సాధ్యం కాదని చెప్పారు. 'నేను చనిపోయినవాడినని, నన్ను వీరజవానుగా మిగిలిపోనివ్వనని కేజ్రీవాల్‌ అన్నారు. కానీ, ఈ రోజు నేను చెబుతున్నాను.. ఆయన(కేజ్రీవాల్‌) చనిపోయిన శరీరంతో జోక్యం చేసుకోవద్దు.. దుర్వాసనను వెదజల్లవద్దు' అని విశ్వాస్‌ అన్నారు. కాగా, కుమార్‌ విశ్వాస్‌ మద్దతుదారులు పార్టీ ఆఫీసు ముందు పెద్ద మొత్తంలో చేరి తమ నేత విశ్వాస్‌ను పార్లమెంటుకు పంపించాల్సిందేనంటూ డిమాండ్‌ చేశారు. కాగా, తనపై కుట్రలు చేశారని కుమార్‌ విశ్వాస్‌పై కేజ్రీవాల్‌ గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు