రైతులను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తాం: కన్నబాబు

26 Jul, 2019 12:31 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉందని చెప్పేందుకే ఏడు లక్షల పరిహారం ఇస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పిన ఆయన.. రైతుల్ని దీర్ఘకాలంలో ఒత్తిడి నుంచి పూర్తిగా బయటికి తేవడం, సేద్యానికి సాయం అందించడం అనే ద్విముఖ వ్యూహాలను ప్రభుత్వం అనుసరిస్తోందని తెలిపారు. అందులో భాగంగానే వ్యవసాయ కమిషన్, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినట్లు ఆయన శుక్రవారం అసెంబ్లీలో వెల్లడించారు. రసాయనాలు, పురుగుమందుల కంపెనీలతో ప్రభుత్వం ఎంవోయూ చేసుకోనుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ల్యాబ్ ఏర్పాటుచేసి పరీక్షల తర్వాతే పురుగుమందులు, ఎరువులు రైతులకు వెళ్లే విధానం తీసుకురానున్నట్లు చెప్పారు. 

మాది రైతు పక్షపాతి ప్రభుత్వం
దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని కన్నబాబు అన్నారు. తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని, రాష్ట్రంలోని రైతులను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఒకవేళ ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ జిల్లా కలెక్టర్‌ తక్షణమే స్పందించాలని ప్రభుత్వం ఆదేశించిందని ఆయన తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించినా లేదా ఆత్మహత్య చేసుకున్నా రైతు కుటుంబానికి రూ. 7లక్షల పరిహారం ప్రభుత్వం అందిస్తుందని ఆయన శుక్రవారం అసెంబ్లీలో తెలిపారు.

శనగ రైతులకు ధర పడిపోవడంతో వారిని ఆదుకోవడానికి రూ. 330 కోట్లు విడుదల చేసినట్టు కన్నబాబు తెలిపారు. పామాయిల అదేవిధంగా రైతులకు రూ. 80 కోట్లు విడుదల చేశామన్నారు. పొగాకు ధరలను స్థీకరించేందుకు గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయంలో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నడూలేని విధంగా వ్యవసాయ మిషన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆక్వా రైతులను ఆదుకునేందుకు విద్యుత్‌ చార్జీలను తగ్గించామని తెలిపారు. యూనిట్‌ విద్యుత్‌ను రూ. 1.50కే ఆక్వా రైతులకు అందజేస్తున్నామని తెలిపారు. 

రైతుల రుణమాఫీపై కన్నబాబు స్పందన
రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఇప్పటికీ 4,5 విడతల్లో రైతులకు సుమారు ఏడువేల ఐదు వందల కోట్లు గత ప్రభుత్వం బకాయి పడింది. ఈ నేపథ్యంలో రుణమాఫీ చెయ్యాలంటూ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు కోరగా.. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు స్పందించారు. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అయితే.. రుణమాఫీ చేసేందుకు డబ్బు లేదని తెలిసి.. ఎన్నికలకు రెండు నెలల ముందు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎలా ప్రకటించారని మంత్రి కన్నబాబు టీడీపీని ప్రశ్నించారు. 

వైఎస్సార్‌సీపీ సభ్యుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులను ఏవిధంగానూ ఆదుకోలేదని విమర్శించారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక మార్కెట్‌ యార్డ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అనంతపురం జిల్లాలో దారుణమైన కరువు పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు బదులు ఇస్తూ.. గతంలో కరువు సహాయక నిధులను చంద్రబాబు ప్రభుత్వం దారిమళ్లించిందని సభ దృష్టికి తీసుకొచ్చారు.

మరిన్ని వార్తలు