యూపీ సీఎం యోగికి మోదీ ఆదేశాలు

17 Jun, 2019 14:25 IST|Sakshi

పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయండి

నీటి సమస్యను పరిష్కారించండి

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని ఆదేశాలు

లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు అధికార బీజేపీ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు సోమవారం లేఖ రాశారు. ముఖ్యంగా గత రెండేళ్ల నుంచి తీవ్ర నీటి ఎద్దడితో రాష్ట్ర ప్రజలు సతమతవుతున్నారని, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్నందున ఆ సమస్యను వెంటనే పరిష్కారించాలని మోదీ సూచించారు. యూపీలోని వెనుకబడిన బుంధేల్‌ఖడ్‌, విద్యాంచల్‌ వంటి ప్రాంతాల్లో నీటి సమస్యతోపాటు మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయని మోదీ వివరించారు. రానున్న రెండేళ్లలో వీటన్నింటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

అలాగే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షకావత్‌కు కూడా మోదీ లేఖ రాశారు. యూపీపై మరింత దృష్టి సారించాలని కోరారు. దీనితో పాటు బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పవిత్ర గంగా ప్రక్షాళణను మరింత వేగవంతం చేయాలని ప్రధాని గుర్తుచేశారు. గంగా నదిని కాలుష్యం కాకుండా చర్యలు చేపట్టాలని యూపీ ప్రభుత్వాన్ని మోదీ ఆదేశించారు. కాగా 2022లో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో అద్భుతమైన విషయాన్ని సాధించిన కమల దళం మరోసారి అవే ఫలితాలను పునారావృత్తం చేయాలని భావిస్తోంది.  దీని కొరకు రెండేళ్ల ముందునుంచే ప్రణాళికలను రూపొందిస్తోంది. 

మరిన్ని వార్తలు