ప్రచారంలో దూసుకెళ్తున్న మోదీ, రాహుల్‌

12 Dec, 2019 16:40 IST|Sakshi

జార్ఖండ్‌: దేశంలో ఎక్కువ కాలం కాంగ్రెస్‌ పార్టీ పాలించినా రామ్‌ జన్మభూమి వివాదాన్ని పరిష్కరించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమైందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం వల్ల ప్రజలు బీజేపీవైపే మొగ్గు చూపుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల జీవన్‌ మిషన్‌ దేశంలో నీటి సమస్యను పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌ ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

మరోవైపు జార్ఖండ్‌లోని ఎన్నికల ప్రచారంలో వాయ్‌నాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోదీ నిజంగా అభివృద్ధికి మద్దతిస్తే జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘుబర్‌ దాస్‌ అభవృద్ధిని విస్మరించినా ఎందుకు ప్రశ్నించడం లేదని విమర్శించారు. బీజేపీ ఎంపీ అత్యాచారం చేసినా మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన అన్నారు. మోదీ చంద్రుడిపైకి రాకెట్లు పంపినప్పటికీ ప్రజలకు శుభ్రమైన నీటిని అందించలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు. రైతులను, ప్రజలను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రైతులకు అండగా ఉంటుందని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఐదు విడతల ఎన్నికల్లో భాగంగా గురువారం మూడో విడత పోలింగ్‌ జరగనుంది. ఏభై లక్షల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు.

మరిన్ని వార్తలు