సద్గురు వీడియోతో మోదీ ప్రచారం

30 Dec, 2019 13:08 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతన్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ మాత్రం సీఏఏపై జరుగుతున్న ఆందోళనలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. అలాగే సీఏఏకు మద్దతుగా దేశ ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ సీఏఏకు మద్దతు కూడగట్టేలా సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. సీఏఏ అనేది శరణార్థులకు పౌరసత్వం కల్పించడానికి మాత్రమేనని.. ఎవరి పౌరసత్వం తొలగించడానికి కాదని ట్వీట్‌ చేశారు. ఇండియా సపోర్ట్స్‌ సీఏఏ(#IndiaSupportsCAA) హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా జత చేశారు. 

నమో యాప్‌లో ఈ హ్యాష్‌ ట్యాగ్‌తో వెతికితే సీఏఏకు సంబంధించి సమగ్ర సమాచారం లభిస్తుందని.. దానిని అందరికి షేర్‌ చేసి సీఏఏకు మద్దతుగా నిలవాలని కోరారు. అంతేకాకుండా సీఏఏపై సద్గురు జగ్గీ వాసుదేవ్ వివరణకు సంబంధించిన వీడియోను కూడా మోదీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. కాగా, సీఏఏ ముస్లింలపై వివక్ష కనబరిచేలా ఉందని ఆందోళనకారులు చెబుతున్నారు. రాజ్యాంగం మూల సూత్రాలను దెబ్బతీసే విధంగా సీఏఏ ఉందని విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు