మోదీ.. శివలింగంపై తేలు!

29 Oct, 2018 05:49 IST|Sakshi

ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ వివాదాస్పద వ్యాఖ్య

రాహుల్‌ క్షమాపణ చెప్పాలన్న రవిశంకర్‌ ప్రసాద్‌

బెంగళూరు: ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు  వివాదాస్పదమయ్యాయి. ఇది ఒక అసాధారణ పోలికగా అభివర్ణిస్తూ.. ‘ప్రధాని మోదీని శివలింగంపై తేలులా ఆరెస్సెస్‌ వారు భావిస్తుంటారు. ఆ తేలును చేత్తో తీసేయలేం. చెప్పుతో కొట్టలేం అనుకుంటుంటారు. ఈ విషయం ఆరెస్సెస్‌లోని ఒక వ్యక్తి ఓ జర్నలిస్ట్‌కు చెప్పారు’ అంటూ థరూర్‌ చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోంది. తన వ్యాఖ్యపై వివరణ ఇస్తూ ‘ఒకవేళ చేత్తో తీస్తే ఆ తేలు కాటేస్తుంది. శివలింగాన్ని చెప్పుతో కొడితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి’ అని థరూర్‌ పేర్కొన్నారు. ‘హిందుత్వ ఉద్యమం, మోదిత్వ భావజాలం మధ్య నెలకొన్న సంక్లిష్ట బంధాన్ని వివరించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది’ అన్నారు. మోదీని నియంత్రించడం బీజేపీ సైద్ధాంతిక గురువైన ఆరెస్సెస్‌కు అత్యంత కష్టంగా మారిందని కూడా థరూర్‌ వ్యాఖ్యానించారు.

బెంగళూరు సాహిత్య వేడుకలో ఆదివారం థరూర్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాజీ కేంద్రమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. వీటిపై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ స్పందించాలని, శివభక్తుడినని చెప్పుకునే రాహుల్‌ ఈ వ్యాఖ్యను సమర్థిస్తారో లేదో చెప్పాలని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. థరూర్‌ వ్యాఖ్యలు మహాశివుడిని అవమానించేవేనని, తక్షణమే రాహుల్, శశిథరూర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రవిశంకర్‌ ప్రసాద్‌ విమర్శలపై థరూర్‌ స్పందిస్తూ.. మోదీకి సంబంధించి ఈ వ్యాఖ్య తాను చేసింది కాదని, ఆ కామెంట్‌ ఇప్పటిది కూడా కాదని, చాన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారమవుతూనే ఉందని సమాధానమిచ్చారు. మోదీపై థరూర్‌ రాసిన ‘ది పారడాక్సికల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ అనే పుస్తకాన్ని మాజీ ప్రధాని మన్మోహన్‌ ఇటీవలే ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు