స్థానిక సంస్థల మంత్రిగా సిద్ధూ ఔట్‌

7 Jun, 2019 02:06 IST|Sakshi
నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ

పునరుత్పాదక ఇంధన మంత్రిగా నియమించిన సీఎం అమరీందర్‌

పంజాబ్‌లో ఎన్నికల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపాటు  

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ తన కేబినెట్‌ సహచరుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూపై కొరడా ఝుళిపించారు. చండీగఢ్‌లో గురువారం కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టిన పంజాబ్‌ సీఎం స్థానిక సంస్థలు, టూరిజం, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి బాధ్యతల నుంచి సిద్ధూను తప్పించారు. అనంతరం విద్యుత్, పునరుత్పాదక ఇంధనవనరుల మంత్రిత్వశాఖను సిద్ధూకు అప్పగించారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లోని పట్టణ, నగర ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పార్టీ  ప్రదర్శనపై సీఎం అమరీందర్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా సిద్ధూ సరిగ్గా వ్యవహరించలేదనీ, అందువల్లే కాంగ్రెస్‌ నిరాశాజనక ప్రదర్శన చేసిందని అభిప్రాయపడ్డారు. తన అనాలోచిత చర్యలతో కాంగ్రెస్‌ లక్ష్యాలను దెబ్బతీశారని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో చండీగఢ్‌లో గురువారం నిర్వహించిన కేబినెట్‌ భేటీకి సిద్ధూ గైర్హాజరయ్యారు. మరోవైపు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టిన అనంతరం సీఎం అమరీందర్‌ మాట్లాడుతూ.. తాజా మార్పుల వల్ల పాలనలో మరింత పారదర్శకతతో పాటు ప్రభుత్వ విభాగాలను మరింత సమర్థవంతంగా నడపడం వీలవుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, ఇప్పటివరకూ సిద్ధూ నిర్వహించిన స్థానిక సంస్థలు టూరిజం శాఖను ఛత్రంజి సింగ్‌కు అమరీందర్‌ అప్పగించారు. ఆరోగ్యం–కుటుంబ సంక్షేమ శాఖను బల్బీర్‌ సిద్ధూకు, త్రిప్త్‌ బజ్వాకు ఉన్నత విద్య, పశుపోషణ–డైరీ, చేపల పెంపకం మంత్రిత్వశాఖలను కేటాయించారు. గుర్‌ప్రీత్‌ సింగ్‌కు రెవెన్యూశాఖను, విజయేందర్‌ సింగ్లాకు పాఠశాల విద్య, రవాణా శాఖను రజియా సుల్తాన్‌కు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖను అరుణా చౌదరికి సీఎం అప్పగించారు.

నన్ను బలిపశువును చేశారు: సిద్ధూ
సీఎం అమరీందర్‌ సింగ్‌ విమర్శలను మంత్రి సిద్ధూ తిప్పికొట్టారు. ‘పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడంలో నేను కీలకపాత్ర పోషించా. నాకు కష్టపడకుండా ఏదీ రాలేదు. గత 40 ఏళ్లుగా నేను అంతర్జాతీయ క్రికెటర్‌గా, క్రికెట్‌ వ్యాఖ్యాతగా, టీవీ కార్యక్రమాల్లో రాణిస్తున్నా. అలాగే యువతలో స్ఫూర్తి పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా 1300కుపైగా మోటివేషనల్‌ కార్యక్రమాల్లో ప్రసంగించాను. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం రూ.10,000 కోట్లు కేటాయించాం. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పంజాబ్‌లోని అమృత్‌సర్, జలంధర్, పటియాలా, ఎస్‌ఏఎస్‌నగర్‌ సహా పలు పట్టణాల్లో గెలిచింది. కానీ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనకు అందరూ నా శాఖనే బాధ్యులుగా చేశారు.

నేను అమరీందర్‌ను నా పెద్దన్నగా భావిస్తాను. ఆయన మాటలను ఎల్లప్పుడూ గౌరవించాను. ఏదైనా విషయముంటే నన్ను వ్యక్తిగతంగా పిలిచి అమరీందర్‌ మాట్లాడాల్సింది. కానీ ఆయన తీరు నాకు బాధ కలిగించింది. ఇప్పుడు మంత్రిమండలి సమిష్టి బాధ్యత ఏమైంది? సీఎం కుర్చీ నా కుర్చీకి 3 అంగుళాల దూరంలోనే ఉన్నప్పటికీ నాపై అమరీందర్‌కు విశ్వాసం లేదు. నా పేరు, విశ్వసనీయత, పనితీరుపై వచ్చే విమర్శలను దీటుగా తిప్పికొడతా. నేను ఎప్పటికీ కాంగ్రెస్‌వాదినే’ అని సిద్ధూ స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు