కమీషన్ల కోసమే కొత్త ప్రాజెక్టులు 

17 Oct, 2017 02:57 IST|Sakshi

ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి ధ్వజం 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కమీషన్ల కోసమే ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు చేపడుతోందని బీజేఎల్పీ నేత జి.కిషన్‌ రెడ్డి ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న పాత ప్రాజెక్టులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. సోమవారం ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ పరిధిలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్బీసీ టీ–1, టీ02) సొరంగ మార్గం పనులను, దోమలపెంటలో టెన్నెల్‌–1 ఇన్‌లెట్లోకి సుమారు కిలోమీటరు వెళ్లి పరిశీలించింది. మన్నెవారిపల్లి టన్నెల్‌–1 ఔట్‌లెట్, నక్కలగండి రిజర్వాయర్‌ పనులను పరిశీలించింది.

నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముడుదండ్లలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఎస్‌ఎల్బీసీ పనులను తానే కుర్చీ వేసుకొని కూర్చుని పూర్తి చేస్తానన్న  కేసీఆర్‌ మాటలు ఏమయ్యా యని ప్రశ్నించారు. నాగర్‌కర్నూలు, నల్లగొండ జిల్లాల్లో 3 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తే ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేద ని చెప్పారు. ఎప్పుడు పూర్తవుతుందోనని ఫ్లోరైడ్‌ బాధితులు ఆశగా ఎదురు చూస్తు న్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు.

శాసనసభలో ప్రాజెక్టు నిర్మాణ పనులపై ప్రస్తావించడంతో పాటు నివేదిక తయారు చేసి గవర్నర్, సీఎంకు అందజే స్తామన్నారు. దేవాదుల, ఎస్సారెస్పీ వరద కాలువ, మిడ్‌మానేరు, నెట్టెంపహాడు, బీమా, కల్వకుర్తి ప్రాజెక్టులను ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శించారు. కిషన్‌ రెడ్డి వెంట ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సాంబమూర్తి, మనోహర్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు