నీతి ఆయోగ్‌ సమావేశం ప్రారంభం

17 Jun, 2018 11:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నాలుగో సమావేశం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ప్రధాని మోదీ గౌరవ ప్రారంభోపన్యాసం చేశారు. సమావేశానికి హాజరైన వారికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడి రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో సాయంత్రం 4 వరకు సమావేశం జరగనుంది. పాలకమండలి చైర్మన్‌గా ఉన్న ప్రధాని సహా మండలి సభ్యులైన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కానీ గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. 

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు నాయుడు కూడా సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్‌ గురువారమే ఢిల్లీకి వెళ్లగా, చంద్రబాబు శనివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. గత సమావేశ నిర్ణయాల అమలు, రైతుల ఆదాయం రెట్టింపు, ఆయుష్మాన్‌ భారత్, పోషణ్‌ మిషన్, మిషన్‌ ఇంద్రధనుష్, మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్న విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు