మోదీపై మరో సీనియర్‌ నేత దండయాత్ర

4 Oct, 2017 11:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీపై సొంతపార్టీ నుంచే విమర్శలు వేగం పుంజుకుంటున్నాయి. సీనియర్‌ నేతలు ఒక్కొక్కరుగా మోదీపై దండెత్తుతున్నారు. ఇప్పటికే పరోక్షంగా అద్వానీ, మురళీమనోహర్‌ జోషి, యశ్వంత్‌ సిన్హా, శత్రఘ్న సిన్హా మోదీని విమర్శించగా ఆ జాబితాలో మరో సీనియర్‌ నేత చేరారు. ఏడాది కిందట దేశంలో మోదీ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం పెద్ద నోట్లు రద్దును తాజాగా అరుణ్‌ శౌరీ తప్పుబట్టారు. అదొక పెద్ద మనీలాండరింగ్‌ స్కీమ్‌ అంటూ ఆరోపించారు. అది ఒక పిచ్చి చర్య అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎవరికైతే నల్లధనం పెద్ద మొత్తంలో ఉందో వారంతా ఆ డబ్బును తెల్లడబ్బుగా మార్చుకున్నారని అన్నారు. మరోపక్క, జీఎస్‌టీని కూడా ఆయన తప్పుబట్టారు.

జీఎస్టీ పూర్తిగా తప్పుదోవపడుతుందని, అమలు విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా సామాన్యుల డబ్బు కొల్లగొట్టినట్లవుతుందని, వారి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కేంద్రం చేసిన తప్పుల్లో జీఎస్‌ఎటీ కూడా ఒకటని అని, దానిని తిరిగి సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. జీఎస్‌టీ అమలు ప్రారంభించి మూడు నెలలు కూడా పూర్తికాకమునుపే ఏడుసార్లు సవరించారని దుయ్యబట్టారు. 'జీఎస్‌టీ ప్రారంభం సందర్భంలో వారంతా అతిగా ఊహించుకొని భారత స్వాతంత్ర్యంతోటి పోల్చారని విమర్శించారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ చాలా స్లోగా ముందుకెళుతోందని, దాదాపు ఇప్పట్లో సరిచేయలేనంత దుస్థితిలో ఉందని, 2019 ఎన్నికల్లో ఈ ప్రభావం కచ్చితంగా ఉంటుందని జోస్యం చెప్పారు.

మరిన్ని వార్తలు