ఆ రెండు అంశాలు లేవు: చిదంబరం

1 Feb, 2019 15:12 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం పెదవి విరిచారు. ఇది ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఓట్ల కోసం చేసిన జిమ్మిక్కుగా వర్ణించారు. ‘ఓటాన్‌ అకౌంట్‌ కాదు అకౌంట్‌ ఫర్‌ ఓట్స్‌’ అంటూ ఎద్దేవా చేశారు.

తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌.. కాంగ్రెస్ డిక్లరేషన్‌ను కాపీ కొట్టారని ఆరోపించారు. మధ్యంతర బడ్జెట్‌ను ఎక్కువసేపు చదివిన మంత్రిగా ఆయన నిలిచిపోతారని వ్యంగ్యంగా అన్నారు. దాదాపు గంటా 40 నిమిషాలు ఆయన బడ్జెట్‌ ప్రసంగం చదివారని గుర్తుచేశారు. పీయూష్‌ బడ్జెట్‌ ప్రసంగం ఎన్నికల ప్రచారాన్ని తలపించిందని విమర్శించారు.

బడ్జెట్‌లో సంతోషించదగ్గ అంశాలు లేవన్నారు. రైతులకు రోజుకు 17 రూపాయలు ఇస్తే సంతోషించాలా? అని ప్రశ్నించారు. విద్య, ఉపాధి గురించి ప్రస్తావించలేదని వెల్లడించారు. పది పాయింట్ల దార్శనిక పత్రంలో ఈ రెండు అంశాలు లేవని చిదంబరం తెలిపారు.

మరిన్ని వార్తలు