పాక్‌ కనుసన్నల్లో కశ్మీర్‌ పార్టీలు

23 Nov, 2018 05:34 IST|Sakshi
రామ్‌ మాధవ్‌, ఒమర్‌ అబ్దుల్లా

దుమారం రేపిన బీజేపీ వ్యాఖ్యలు

తిప్పికొట్టిన ఎన్‌సీ, పీడీపీ

తన మాటలు వెనక్కి తీసుకున్న రామ్‌ మాధవ్‌

20 రోజుల నుంచే బేరసారాలు

న్యూఢిల్లీ/శ్రీనగర్‌: కశ్మీర్‌ అసెంబ్లీ రద్దయ్యాక గురువారం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. పాకిస్తాన్‌ ప్రోద్బలంతోనే బద్ధ శత్రువులైన పీడీపీ, ఎన్‌సీలు చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాయన్న బీజేపీ నాయకుడు రామ్‌ మాధవ్‌ వ్యాఖ్యలపై ఎన్‌సీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణల్ని రుజువుచేయాలని లేదంటే క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో రామ్‌ మాధవ్‌ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు.

ప్రభుత్వ ఏర్పాటులో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరిగే అవకాశాలున్నాయని వచ్చిన నివేదికల్ని బహిర్గతం చేయాలని గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ను ఒమర్‌ కోరారు. కశ్మీర్‌ ప్రాంతీయ పార్టీలు పాక్‌ కనుసన్నల్లో పనిచేస్తున్నాయన్న బీజేపీ వ్యాఖ్యలపై రాష్ట్ర మాజీ సీఎం, పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. బీజేపీతో పొత్తుపెట్టుకున్నప్పుడు మాత్రం పీడీపీ, ఎన్‌సీల దేశభక్తి, విశ్వసనీయతను ఆ పార్టీ ప్రశ్నించలేదని అన్నారు.  ‘ఒక పార్టీ జాతీయవాదం, దేశభక్తిని ఎలా నిర్ణయిస్తారు. కేంద్రంతో ఉంటే దేశభక్తులు.. లేకుంటే జాతి వ్యతిరేకులా?’ అని సూటిగా ప్రశ్నించారు.  

కలసి పోటీచేయగలరా?: రామ్‌ మాధవ్‌
బీజేపీ, ఎన్‌సీల మధ్య ట్వీటర్‌ వేదికగా మాటల యుద్ధం జరిగింది. పీడీపీ, ఎన్‌సీల స్నేహం నిజమైనదైతే వచ్చే ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీలు కలసి పోటీచేయాలని కశ్మీర్‌ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జీ రామ్‌ మాధవ్‌ సవాలు విసిరారు. ప్రభుత్వ ఏర్పాటుకు కలసిరావాలని కశ్మీర్‌ ప్రాంతీయ పార్టీలకు పాక్‌ నుంచి ఆదేశాలు అందాయన్నారు. పాక్‌ సూచనల మేరకు ఎన్‌సీ, పీడీపీలు స్థానిక సంస్థల ఎన్నికల్ని బహిష్కరించాయన్నారు.

మాధవ్‌ ఆరోపణల్ని ఒమర్‌ అబ్దుల్లా తిప్పికొడుతూ ‘ ఐబీ, రా, సీబీఐ లాంటి సంస్థలు మీ నియంత్రణలోనే ఉన్నాయి. ధైర్యముంటే మీ ఆరోపణల్ని నిరూపించే సాక్ష్యాలు బయటపెట్టండి’ అని డిమాండ్‌ చేశారు. దీనికి మాధవ్‌ బదులిస్తూ ‘ మీ దేశభక్తిని శంకించడం లేదు. కానీ పీడీపీ, ఎన్‌సీల మధ్య హఠాత్తుగా పుట్టుకొచ్చిన ప్రేమ సందేహాలకు తావిస్తోంది. విదేశీ ఒత్తిడి లేదని లేదంటున్నారు కాబట్టి నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీచేసి మీ మధ్య స్నేహం నిజమైనదే అని నిరూపించండి’ అని అన్నారు.

ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు..
కేంద్రం ఒత్తిడితోనే అసెంబ్లీని రద్దుచేశారన్న ఆరోపణల్ని గవర్నర్‌ తోసిపుచ్చారు. ‘భారీ స్థాయిలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు నివేదికలొస్తున్నాయి. ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. తెరచాటుగా చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయి. తన వర్గం ఎమ్మెల్యేలను నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) సాకుతో బెదిరిస్తున్నారని మెహబూబా ఆరోపించారు. మరో వర్గం ఎమ్మెల్యేలకు గుర్తుతెలియని వారు భారీగా డబ్బు ఆశ చూపారు. ఈ బేరసారాలు 20 రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి’ అని మీడియాకు వివరించారు.

మే లోపే ఎన్నికలు: సీఈసీ
కశ్మీర్‌లో మే లోపు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లోక్‌సభ ఎన్నికల కన్నా ముందే అక్కడ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రావత్‌ చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అసెంబ్లీ రద్దయితే ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాలి. కశ్మీర్‌ విషయంలో ఆ గడువు మే వరకు ఉంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొనే పోలింగ్‌ తేదీల్ని ఖరారుచేస్తామని రావత్‌ చెప్పారు. అసెంబ్లీ రద్దయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోందని, తెలంగాణలోనూ ఇదే నియమాన్ని వర్తింపజేస్తున్నామని తెలిపారు.  

మెహబూబాకే మేలు!
కశ్మీర్‌ రాజకీయ డ్రామాలో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీదే విజయమా? కాంగ్రెస్, ఎన్‌సీ మద్దతుతో ఆమె ముఖ్యమంత్రి కాకుండా గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ అడ్డుకోవడం తాత్కాలికమేనా? అంటే..అసెంబ్లీ రద్దు పరోక్షంగా బీజేపీకి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు సజ్జన్‌ గని లోన్‌ని సీఎం చేసి కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుచేయాలనుకున్న బీజేపీ ప్రయత్నాలకు అసెంబ్లీ రద్దుతో గండిపడినట్లయింది. పీడీపీ, ఎన్‌సీ, కాంగ్రెస్‌లు తమకున్న ఎమ్మెల్యేల బలంతోనే ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నాయని, ఈ ఆలోచన ప్రతిపాదిత కూటమికి మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

జూన్‌ 19న పీడీపీ–బీజేపీ సంకీర్ణం కుప్పకూలిన తరువాత పీడీపీ అస్తిత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నేత సజ్జన్‌ గని బీజేపీతో చేతులు కలిపి సీఎం అవుతారనే ప్రచారంతో..కొందరు పీడీపీ సభ్యులు ఆయన గూట్లో చేరారు. బుధవారం మధ్యాహ్నం వరకు అత్యంత నిరాశాజనకంగా ఉన్న పీడీపీ శిబిరంలో ఒక్కసారిగా ఆశావహ వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎన్‌సీల మద్దతు తనకు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ రాయడం ద్వారా ముఫ్తీ.. సజ్జద్‌ ఫ్రంట్‌లోకి మరిన్ని వలసల్ని నిలువరించారు. గవర్నర్‌ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయాలని మెహబూబా యోచిస్తున్నట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు