మంత్రులపై ప్రధాని అసంతృప్తి

22 Nov, 2019 08:43 IST|Sakshi

ప్రశ్నోత్తరాల వేళ మంత్రులు సభలో లేకపోవడంపై...

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రశ్నోత్తరాల సమయంలో కేబినెట్‌ మంత్రులు లేకపోవడంపై ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం కేబినెట్‌ సమావేశం జరిగిన తర్వాత కేబినెట్‌ మంత్రులు లోక్‌సభ, రాజ్యసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా లేకపోవడంపై మోదీ అసహనం వ్యక్తం చేశారని అధికార వర్గాలు చెప్పాయి. ‘పార్లమెంటరీ కార్యక్రమాల్లో ప్రశ్నోత్తరాలకు ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వం చేపట్టిన ప్రజోపయోగ నిర్ణయాలను సభా ముఖంగా ప్రకటించేందుకు అవకాశం ఉంటుంది. సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు కీలక అంశాలపై ప్రభుత్వ వైఖరిని వివరించేందుకు వీలుంటుంది’ అని ప్రధాని అన్నారని పేర్కొన్నాయి.
 
సమర్థ ఆడిటింగ్‌తో మోసాలకు చెక్‌ 
మోసాలను అరికట్టేందుకు, ప్రభుత్వ విభాగాల సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆడిటింగ్‌లో ఆధునిక విధానాలను ప్రవేశపెట్టాలని మోదీ కోరారు. దేశాన్ని 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఇది ఉపకరిస్తుందని పేర్కొన్నారు. 2022 కల్లా నిరూపిత ఆధారిత విధానాన్ని రూపొందిస్తుందని, వివరాలను విశ్లేషించడం ద్వారా కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) మార్గదర్శనం చేస్తుందని తెలిపారు. గురువారం కాగ్‌ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ..‘అక్రమాలను మనం ఎదుర్కోవాలి. ఇందుకోసం ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్‌ ఆడిటర్లు వినూత్న విధానాలను కనుగొనాలి’ అని అన్నారు. ప్రభుత్వ విభాగాల్లో అక్రమాలను నిరోధించేందుకు ఇటీవలి కాలంలో చాలా ప్రయత్నాలు జరిగాయన్నారు.

మరిన్ని వార్తలు