హరికృష్ణ మృతిపట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం

29 Aug, 2018 09:24 IST|Sakshi

అమరావతి: సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ ఆకస్మిక మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలక పాత్ర పోషించిన హరికృష్ణ మృతి పార్టీకి తీరని లోటని ఏపీ ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు.

తెలుగుదేశం సీనియర్‌ నేత, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి, నందమూరి హరికృష్ణ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సినీ, రాజకీయ జీవితంలో హరికృష్ణ ప్రత్యేక ముద్రవేశారని చెప్పారు.

వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ..నందమూరి హరికృష్ణ మృతి చాలా బాధాకరమన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

నందమూరి హరికృష్ణ మృతి పట్ల ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రి కళా వెంకట్రావు,  ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు మీడియా ద్వారా తెలిపారు.

హరికృష్ణ మృతి తనకు దిగ్భ్రాంతికి గురిచేసిందని పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివని, హరికృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ రోజు జనసేన అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు