దేవెగౌడ ఇంటికి రాహుల్‌ గాంధీ

6 Mar, 2019 13:17 IST|Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై చర్చ

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం మాజీ ప్రధానమంత్రి, జనతా దళ్‌ (ఎస్‌) అధినేత హెచ్‌డీ దేవేగౌడ నివాసానికి చేరుకున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ మధ్య సీట్ల పంపకాలపై చర్చించేందుకు దేవేగౌడతో రాహుల్‌ భేటీ అయ్యారు. కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్నప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. రాహుల్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన దేవెగౌడ.. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా జేడీఎస్‌ పది స్థానాలు కోరిందని, రాహుల్‌ కేసీ వేణుగోపాల్‌, డానిష్‌ అలీతో చర్చించిన అనంతరం.. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

ముఖ్యంగా దక్షిణ పాత మైసూరు ప్రాంతంలో సీట్ల పంపకాల విషయమై కాంగ్రెస్‌-జేడీఎస్‌ తీవ్రంగా తర్జనభర్జన పడుతున్నాయి. ఈ ప్రాంతంలో ఈ రెండు పార్టీలు బద్ధవిరోధులుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ సీట్ల పంపకాలు జరిపి.. ఇరు పార్టీల శ్రేణుల మధ్య సయోధ‍్య కుదర్చడం కాంగ్రెస్‌-జేడీఎస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ప్రాంతంలోని మాండ్య, హసన్‌ లోక్‌సభ సీట్లను జేడీఎస్‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో ఒక్క అసెంబ్లీ సీటును కూడా కాంగ్రెస్‌ గెలుచుకోలేకపోయింది.

>
మరిన్ని వార్తలు