రంగంలోకి రాహుల్‌.. రెండు సీట్లకు ఓకేనా?

5 Mar, 2019 13:04 IST|Sakshi

ఆప్‌తో పొత్తుకు రాహుల్‌ ప్రయత్నం

కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో సమావేశం

రెండు సీట్లు ఇస్తాం: ఆప్‌

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రాజధాని ఢిల్లీలోని ఆరు లోక్‌సభ స్థానాలకు ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ అప్రమత్తమయ్యారు. ఆప్‌తో పొత్తుకు మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో రాహుల్‌ సమావేశమయ్యరు. ఆప్‌తో కూటమిగా పోటీచేయాలని ఈ సమావేశంలో చర్చించనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మొత్తం ఏడు స్థానాల్లో ఆప్‌ నాలుగు, కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో పోటీచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోస్థానాన్ని ఇద్దరికీ అనుకూలంగా ఉన్న వ్యక్తిని పోటీలో నిలపాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే రెండు స్థానాలకు కాంగ్రెస్‌ ఒ‍ప్పుకుంటుందా అనేది ప్రస్తుత చర్చ. ఆప్‌-కాంగ్రెస్‌ పొత్తుపై రాహుల్‌ నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీలో ఆప్‌తో కలిసి పోటీచేస్తే జాతీయ స్థాయిలో కూడా కూటమికి బలం చేకూర్చే అవకాశం ఉందని రాహుల్‌ భావిస్తున్నారు. ఇదే పొత్తును పంజాబ్‌లో కూడా కొనసాగించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో అక్కడ ఆప్‌ నాలుగు లోక్‌సభ స్థానాలకు గెలుకుంది. (ఆరు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన)

అధికార బీజేపీని రాజధానిలో ఢీకొనేందుకు కాంగ్రెస్‌, ఆప్‌ వ్యూహాలు రచిస్తున్న విషయం తెలిసిందే. గతంలో వరుసగా  పదిహేనేళ్లు పాలించిన చరిత్ర కాంగ్రెస్‌కు, గత  అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లు గెలుచుకున్న  బలం ఆప్‌కు ఉన్న నేపథ్యంలో ఇరుపార్టీలు కలిసి పోటీచేస్తే బీజేపీని ఎదుర్కొవచ్చని రాహుల్‌, కేజ్రీవాల్‌ అభిప్రయపడుతున్నారు. అయితే సీట్ల ఒప్పందంపై తాము కాంగ్రెస్‌కు చేసిన ప్రతిపాదనపై ఎలాంటి స్పందన లేదని, ఆప్‌ ఇటీవల ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది.

ఆప్‌ ప్రకటించిన ఆరుగురు అభ్యర్థులు వీరే: ఆతిషి (ఢిల్లీ ఈస్ట్), గుగ్గన్ సింగ్ (నార్త్ వెస్ట్), రాఘవ్ చద్ధా (సౌత్), దిలీప్ పాండే (నార్త్ ఈస్ట్), పంకజ్ గుప్తా (చాందిని చౌక్),  బ్రిజేష్ గోయల్ (న్యూఢిల్లీ).


 

మరిన్ని వార్తలు