లోక్‌సభ బరిలో లేను

18 Feb, 2019 04:38 IST|Sakshi

అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం: రజనీకాంత్‌

సాక్షి, చెన్నై: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రముఖ నటుడు రజనీకాంత్‌ స్పష్టం చేశారు. అలాగే తాను ఏ పార్టీకి కూడా మద్దతు తెలపడం లేదని అన్నారు. తమిళనాడు నీటి సంక్షోభాన్ని ఏ పార్టీ శాశ్వతంగా పరిష్కరిస్తుందని భావిస్తున్నారో దానికే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏడాది క్రితమే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన రజనీకాంత్‌..రజనీ మక్కల్‌ మంద్రమ్‌ అనే వేదికను ఏర్పాటుచేసి తన మద్దతుదారులు, అభిమానులలో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ‘సార్వత్రిక ఎన్నికల్లో నేను పోటీచేయడంలేదు. మన లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలే.

నేను ఎవరికీ మద్దతివ్వడం లేదు. ప్రచార సమయంలో నా ఫొటోగానీ, సంస్థ జెండాను గానీ ఎవరూ వాడొద్దు’ అని ఆదివారం తన నివాసంలో రజనీ మక్కల్‌ మంద్రమ్‌ జిల్లా కార్యదర్శులతో జరిగిన కార్యక్రమంలో రజనీకాంత్‌ ప్రకటించారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలు, పార్టీ ఏర్పాటు, సినిమాలు తదితరాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. 2020 ఆగస్టు నెలలో పార్టీని ఏర్పాటుచేద్దామని, ఆ తరువాత చాలా మంది పెద్దలు తమ పార్టీలో చేరతారని, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకుంటామని ఆయన కార్యకర్తల్లో ఉత్సాహం నింపినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు