బీజేపీలోకి సాధ్వి ప్రజ్ఞా

18 Apr, 2019 01:47 IST|Sakshi

భోపాల్‌లో దిగ్విజయ్‌పై పోటీ

భోపాల్‌/న్యూఢిల్లీ: మాలెగావ్‌ బాంబు పేలుడు కేసులో నిందితురాలైన సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ బుధవారం బీజేపీలో చేరారు. భోపాల్‌ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌తో పోటీ పడనున్నారు. అతివాద భావాలున్న సాధ్విని మాలెగావ్‌ బాంబు పేలుడు కేసులో మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక స్క్వాడ్‌ 2008లో అరెస్టు చేసింది. కాగా, ఇటీవలే ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. బీజేపీకి కంచుకోటలా భావించే భోపాల్‌లో గట్టి పోటీ ఇవ్వగల అభ్యర్థిని బరిలోకి దింపాలని బీజేపీ భావించింది.

4.5 లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో హిందూత్వ భావాలున్న నేత సాధ్విని కాంగ్రెస్‌పై పోటీకి దింపింది. మధ్యప్రదేశ్‌లోని భింద్‌ జిల్లాలో జన్మించిన ప్రగ్యా ఆర్‌ఎస్‌ఎస్‌లో సుదీర్ఘ కాలంగా సేవలు అందించారు. సాధ్వి పోటీపై పీడీపీ అధ్యక్షురాలు, కశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా స్పందిస్తూ.. ‘నేను ఒకవేళ ఉగ్రవాద నిందితుడిని పోటీలో దింపితే ఎలాంటి ఆగ్రవేశాలు వెల్లడవుతాయో ఊహించండి. టీవీ చానెళ్లు మెహబూబా టెర్రరిస్ట్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌తో వార్తలు ఇస్తాయి. వారిమటుకు కాషాయం ప్రస్తావన వస్తే మతం ప్రస్తావన రాదు. ముస్లింల విషయమొచ్చే సరికి ఉగ్రవాదులు అంటారు’ అని అన్నారు.

మరిన్ని వార్తలు