వారి నెత్తుటితో మా పార్టీ తడిసిపోయింది : సల్మాన్‌ ఖుర్షీద్‌​

24 Apr, 2018 15:48 IST|Sakshi
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ (పాత చిత్రం)

అలీఘర్ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ సొంత పార్టీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్‌ పార్టీ ముస్లింల నెత్తుటి మరకలతో తడిసిపోయిందంటూ’  ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో భాగంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆమిర్‌ మింటో అనే విద్యార్థి..  ‘కాంగ్రెస్‌ పాలనలోనే మతపరమైన అల్లర్లు ఎక్కువగా జరిగాయి కదా’  అంటూ సల్మాన్‌ ఖుర్షీద్‌ను ప్రశ్నించాడు. ఇందుకు సమాధానంగా.. ‘కాంగ్రెస్‌ పార్టీకి ముస్లింల నెత్తుటి మరకలు అంటుకున్నాయి. ఆ పార్టీకి చెందిన నాయకుడిగా నాకు కూడా అందులో భాగం ఉన్నట్టుగా భావిస్తున్నా’  అంటూ సల్మాన్‌ ఖుర్షీద్‌ వ్యాఖ్యానించారు.

సల్మాన్‌ సమాధానం విన్న తర్వాత ఆమిర్‌ మింటో మరిన్ని ప్రశ్నలు సంధించాడు. ‘1948లో అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎమ్‌యూ) చట్టానికి చేసిన సవరణల వల్ల ముస్లిం దళితలు ఎస్సీ, ఎస్టీ కోటా ద్వారా పొందే రిజర్వేషన్‌కు దూరం అయ్యారు. హషీమ్‌పురా, మల్యానా, మీరట్‌, ముజఫర్‌ నగర్‌, భగల్‌పూర్‌, మొరదాబాద్‌, అలీఘర్‌లలో ముస్లిం వ్యతిరేక అల్లర్లు.. బాబ్రీ మసీదు కూల్చివేత కూడా కాంగ్రెస్‌ పాలనలో జరిగింది కదా. మరి మీరన్నట్టు ఆ నెత్తుటి మరకలను కాంగ్రెస్‌ పార్టీ ఎలా శుభ్రం చేసుకోగలదు’ అంటూ ఆమిర్‌ మింటో ప్రశ్నించాడు.

అయితే తానొక వ్యక్తిగా మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశానని, తాను కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధిని కాదని, తానే కాంగ్రెస్‌ పార్టీ అంటూ సమధానమిచ్చారు. సల్మాన్‌ ఖుర్షీద్ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీ ఇరుకున పడినట్లయింది. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ ‘కాంగ్రెస్‌ పార్టీ చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే సమయం ఆసన్నమైందంటూ’  విమర్శించారు.

>
మరిన్ని వార్తలు