సీబీఐని కుదిపేసిన సానా సతీష్‌ ఇక్కడివాడే

24 Oct, 2018 09:23 IST|Sakshi

చిరుద్యోగి నుంచి .. బడా వ్యాపారిగా ఎదిగి

పొలిటికల్‌ లాబీయింగ్‌లోనూ దిట్ట

చంద్రబాబు బినామీగా ఉన్న ఎంపీకి అత్యంత సన్నిహితుడు

సాక్షి, కాకినాడ: ఇరవైయేళ్ల క్రితం అతనో సాధారణ చిరుద్యోగి. తండ్రి చనిపోవడంతో  కారుణ్య నియామకం కింద విద్యుత్‌శాఖలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా చేరాడు. కొంతకాలానికే ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి వ్యాపార రంగంలో అడుగుపెట్టి...చిరుద్యోగి నుంచి బడా వ్యాపారిగా, పొలిటికల్‌ లాబీయింగ్‌లో దిట్టగా గుర్తింపు పొందాడు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బినామీగా ఉన్న ఓ ఎంపీకి అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతున్నాడు. ఆయనే సీబీఐలో తీవ్ర సంక్షోభానికి తెరలేపిన సానా సతీష్‌. తూర్పు గోదావరిజిల్లా కాకినాడకు చెందిన ఆయన పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.  సుమారు పదిహేనేళ్ల క్రితమే సబ్‌ ఇంజినీర్‌గా, ఏఈగా పనిచేస్తూ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా వ్యవహరించాడు. ఆ తరువాత ఉన్నత స్థాయిలో ఏర్పడిన పరిచయాలతో ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. అక్కడ ప్రఖ్యాత క్రికెటర్‌ చాముండేశ్వరీనాథ్‌ వంటి ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలతో ఆల్‌ ఇండియా క్రికెట్‌ అసోసియేషన్‌ మ్యూజియం కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు.

పెరిగిన పరిచయాలతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి కోట్లకు పడగలెత్తి 25కుపైగా కంపెనీల్లో డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు.  ఓ కేసులో సీబీఐ అత్యున్నత అధికారిగా ఉన్న రాకేష్‌ ఆస్తానా మధ్యవర్తి ద్వారా రూ.5 కోట్లు లంచం అడిగారంటూ చేసిన ఆరోపణ ఇప్పుడు సీబీఐని ఓ కుదుపు కుదిపింది. ఇదే వ్యవహారంలో ఓ సీబీఐ డీఎస్పీ అరెస్టు కావడంతో అందరి దృష్టి ఈ వ్యవహారంపై పడింది. దేశంలోనే సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో సానా సతీష్‌ కీలక వ్యక్తి అన్న సమాచారం ఈ ప్రాంతవాసుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఓ టీడీపీ ఎంపీతో ఆయనకున్న సాన్నిహిత్యంపై ఇప్పుడు చర్చకు దారితీసింది. సీబీఐ వ్యవహారంలో సదరు ఎంపీ పాత్ర ఉందన్న సమాచారంపై ఈ ప్రాంతవాసులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. జిల్లాకు చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన అంశంలోనూ సానా సతీష్‌ క్రియాశీలకంగా వ్యవహరించాడని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. పార్టీ మారేందుకు ఇచ్చే తాయిలాలు, నగదు లావాదేవీలను డాయనే దగ్గరుండి జరిపించాడని చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు