‘సామాజిక’ ప్రభావంపై ఈసీ విశ్లేషణ

16 Oct, 2018 01:37 IST|Sakshi

ఎన్నికల్లో సోషల్‌ మీడియా ప్రభావంపై అధ్యయనం

ఈసీ ఆదేశాలతో మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కావడంతో సామాజిక మాధ్యమాలకు ఎన్నికల ఫివర్‌ పట్టుకుంది. ఫేస్‌బుక్, ట్వీట్టర్, వాట్సాప్, యూ ట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఎన్నికల ప్రచారం, ప్రత్యర్థులపై ఆరోపణలు ప్రత్యారోపణల కోసం అధికార, విపక్ష పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు, ఆయా పార్టీల ఐటీ విభాగాలు సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి.

గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఈ మాధ్యమాల వాడకం భారీగా పెరిగి ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఎన్నికలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని విశ్లేషించేందుకు వాటి ద్వారా జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళిపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా సోషల్‌ మీడియా పర్యవేక్షణ కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.

ఈసీ ఆదేశాలతో తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో భాగంగా సామాజిక మాధ్యమాల పర్యవేక్షణ విభాగం ఏర్పాటైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం కేంద్రంగా పని చేస్తున్న ఈ విభాగం ఈ మాధ్యమాల్లో ఎన్నికల ప్రచార సరళిని విశ్లేషించి రోజువారీ నివేదికలు అందజేస్తుంది. సమాచార విశ్లేషణ (డేటా అనలిటిక్స్‌) టెక్నాలజీ రంగంలో నైపుణ్యం కలిగిన ఓ ప్రైవేట్‌ ఐటీ కన్సల్టెన్సీకి ఈసీ ఈ బాధ్యతను అప్పగించింది.

15 రోజుల నివేదిక సమర్పణ...
ఎన్నికల ప్రచార విశ్లేషణలో భాగంగా రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, మంత్రులు, 31 జిల్లాల కలెక్టర్లకు సంబంధించిన అధికారిక సామాజిక మాధ్యమాల ఖాతాలపై సైతం ఈ విభాగం దృష్టి పెట్టింది. ఈ ఖాతాల ద్వారా జరుగుతున్న ప్రచార కార్యక్రమాలు, వాటికి లభిస్తున్న లైక్‌లు, షేర్ల సంఖ్య, కామెంట్ల ఆధారంగా ప్రచార సరళిని కన్సల్టెన్సీ రోజువారీగా విశ్లేషిస్తోంది. పార్టీల సామాన్య కార్యకర్తలు పెడుతున్న రాజకీయ పోస్టుల్లో కొన్నింటిని ప్రింట్‌ తీసి రోజువారీ నివేదికలతో జత చేసి సీఈఓ కార్యాలయానికి సమర్పిస్తోంది.

గత నెల 27న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నాటి నుంచి 15 రోజుల వరకు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌ మాధ్యమాల వేదికగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచార సరళిపై ఇప్పటికే ఈ కన్సల్టెన్సీ నివేదికను సమర్పించింది. ప్రజలకు అవుతున్న చేరువ ఆధారంగా ఎన్నికలపై ట్విట్టర్‌ 60 శాతం, ఫేస్‌బుక్‌ 30 శాతం, యూట్యూబ్‌ 1 శాతం ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నట్లు సమాచారం.

శాసనసభ ఎన్నికలకు సంబంధించి ట్వీట్టర్, గూగుల్‌ ట్రెండ్స్‌లో రోజువారీగా ఏఏ అంశాలకు అధిక ప్రాచుర్యం లభిస్తోంది అన్న సమాచారాన్ని సేకరించి సీఈఓ కార్యాలయానికి సమర్పించే నివేదికల్లో పొందుపరుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ప్రచార సరళిని విశ్లేషించడానికే ఈ విభాగం పని చేస్తోందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. సామాజిక మాధ్యమాల్లో జరిగే అభ్యంతరకర, అసభ్యకర ఎన్నికల ప్రచార కార్యక్రమాలన్నింటినీ గుర్తించి చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని తెలిపాయి. ఇలాంటి పోస్టులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకోగలమని, ఫిర్యాదులపై సైబర్‌ పోలీస్‌ విభాగం దర్యాప్తు చేయనుందని ఓ అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు