ఆకలి తీర్చడమే పరమార్థం | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 16 2018 1:36 AM

Article On Importance Of Provide Food To Needy People - Sakshi

ఆహార అన్వేషణే మనిషి మనుగడను సమున్నతమైన మలుపులు తిప్పింది. నేడు అదే ఆహారం మనుషులను విడ గొడుతోంది. ఆహారాన్ని అలక్ష్యం చేసే వారుగా, ఆహారం అందనివారుగా మనుషులు విడిపోయారు. ఆహారం లేమితో బాధపడేవారిలో ఎటువంటి వర్గీకరణలు లేవు. సమాజంలో ఆర్థిక పరంగా వున్న వర్గీకరణలేవీ ఆహా రాన్ని అలక్ష్యం చేసేవారికి వర్తించవు. తెలిసి, తెలిసీ ధనిక, ఎగువ మధ్య తరగతివారు ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే; దిగువ మధ్యతరగతి వారు తెలియకుండానే ఆహారాన్ని వృధా చేస్తున్నారు. ఆమధ్య వరకూ ఎయిడ్స్‌ కారణంగా, ఆ తర్వాత క్యాన్సర్‌ వల్ల ప్రపంచంలో అత్యధికులు మరణిస్తు న్నట్టు చాలా చదువుకున్నవారు సైతం విశ్వసిస్తారు. కానీ, ఆకలితో చనిపో యేవారి సంఖ్యే చాలా ఎక్కువ అని తక్కువమందికి  తెలియడం విషాదం.
 
ఆహారాన్ని వృధా చేయకూడదని చాలామంది అనుకుంటారు. కానీ, అందుకు చేయాల్సిందేమిటనే దానిపై ఎవరికీ సరైన అవగాహన ఉండదు. వాట్సప్‌లో వచ్చే మెసేజ్‌లను మొక్కు బడిగా ఫార్వర్డ్‌ చేసేసి చేతులు దులు పుకుంటారు. అందుకే ఐక్యరాజ్య సమి తికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ ‘జీరో హంగర్‌’ను ఇంటి నుంచే ప్రారంభించమని చెబుతుంది. అది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మేలు చేయడంతోపాటు ప్రపంచంలోని అన్నార్తుల ఆకలి తీరుస్తుంది. తక్కువ పదార్థాలతో రుచికరమైన వంట చేయ డం; మిగిలిపోయిన అన్నం, రొట్టె లతో కొత్త ఆహారాన్ని తయారుచేసు కోవడం; అవసరమైన మేరకే సరు కులు కొనుగోలు చేయడం; ఎక్స్‌పె యిరీ తేదీల విషయంలో జాగరూక తతో ఉండటం వంటి పలు చర్యలను ఎవరికివారు అలవర్చుకోవాలి. పండిన కూరగాయల్లో 40 శాతం, ఆహారధాన్యాలు 30 శాతం పూర్తిగా వృధా అవుతున్నాయని ఒక అంచనా.  

కడుపునిండా తిని ‘బ్రేవ్‌’మని తేన్చేలోపు ఆ ఊహకు సైతం నోచు కోని సుమారు 20 కోట్ల మంది మన దేశ పౌరులు ఆకలితో నిద్రిస్తున్నారని మర్చిపోవద్దు.  చేతి నుంచి ఓ అన్నం మెతుకు వృధాగా నేలరాలిపోతున్న ప్పుడల్లా.. ప్రతిరోజూ 7,000 మంది భారతీయులు ఆకలితో అసువులు బాస్తున్నారని విస్మరించొద్దు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పడం కాదు, ఆకలి తీర్చడమే ఆహారం పర మార్థం అని మరోసారి గుర్తుచేసు కుందాం.
(నేడు ప్రపంచ ఆహార దినోత్సవం)
– అక్షర, హైదరాబాద్‌
 

Advertisement
Advertisement